హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ డిమాండ్‌కు కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 జవహర్ నవోదయ పాఠశాలలు ఉండగా, కొత్తవాటితో కలిపితే వాటి సంఖ్య 16కు చేరనున్నది. జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రికొత్తగూడెం, మేడ్చల్మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లాల్లో కొత్త స్కూళ్లను ఏర్పాటుచేయనున్నారు.
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1256 కేవీలు ఉండగా, కొత్తవి 85 కలిపి వాటి సంఖ్య 1341కి చేరనున్నది. ఇక నవోదయ పాఠశాలలు ఇప్పటికే 661 ఉండగా కొత్తవి 28 కలిపితే మొత్తం 689 కానున్నాయి.
రాష్ట్రానికి కొత్తగా నాలుగు డైట్ కాలేజీలు మంజూరైనట్టు ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఏడు జోన్లలో ఇప్పటికే 10 డైట్ కాలేజీలు ఉండగా, మరో నాలుగు ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని కాళేశ్వరం జోన్లలో నెలకొల్పనున్నట్టు పేర్కొన్నారు.