భక్తులు ఎంతో భక్తితో కోడెలను స్వామి వారికి సమర్పిస్తారు. వాటిని కాపాడే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్ పార్టీ వాటి బాధ్యత తీసుకొని సంరక్షిస్తుంది. – హరీశ్‌రావు
నర్సాపూర్, జూన్ 4: ప్రభుత్వం రైతులకు బకాయిపడ్డ రైతుభరోసా నిధుల విడుదలపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఎకరాకు రూ.18 వేల చొప్పున బకాయి పడిందని వివరించారు. వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం దురదృష్టకరమని, ఇది రాష్ర్టానికి అరిష్టమని పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేములవాడలో వారం వ్యవధిలోనే 26 కోడెలు మరణించాయని, మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని, వాటని రక్షించేందుకు ప్రయత్నించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోడెల మరణాలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామంటూ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి, మాట తప్పడం తెలంగాణకు శాపంగా మారిందని చెప్పారు. కోడెలకు పచ్చిగడ్డి, కుడితి పెట్టడానికి ఈ రాష్ట్రంలో డబ్బు లేదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలన ఆగమాగం జగన్నాథం
కాంగ్రెస్ పాలన ఆగమాగం జగన్నాథం అన్నట్టుగా ఉన్నదని, ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా నెరవేర్చారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడితే, రేవంత్‌రెడ్డి మాత్రం అబద్ధాల్లో అగ్రగామిగా నిలిపారని దుయ్యబట్టారు. నోరు కట్టుకుంటే ఏడాదికి రూ.40 వేల కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి.. మరి నోరు ఎందుకు కట్టుకుంటలేదో అర్థం కావడం లేదని చురకలంటించారు. మార్చి 31 కల్లా రైతుభరోసా డబ్బులు అందరికీ ఇస్తానని చెప్పారని, కానీ జూన్ వచ్చినా యాసంగి రైతుభరోసా పడలేదని పేర్కొన్నారు. వడ్ల కుప్పల మీద ఊపిరాగిపోతుంటే, పిట్టల్లాగా రైతులు రాలిపోతుంటే, అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపాయెనని మండిపడ్డారు. మరణించిన రైతులను పరామర్శించలేదని, ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని, రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో అది కూడా నిలిచిపోయిందని విమర్శించారు. సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇవ్వడం లేదని, ఇప్పటికే ప్రభుత్వం రూ.1,100 కోట్లు పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. తక్షణమే రైతులకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వం జొన్నలు కొని ఇప్పటికీ ఒక్క రూపాయి చెల్లించలేదని అసహనం వ్యక్తంచేశారు.
పంటల బీమా ఏమైంది?
రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పంటల బీమా అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారని, కానీ ఇంతవరకు నెరవేర్చలేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. తక్షణమే ఈ వానకాలానికి ఒక్క రూపాయి కూడా రైతుల నుంచి తీసుకోకుండా పంటల బీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో సైతం ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వడగండ్లతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు, అందాల పోటీలకు డబ్బులు వస్తున్నాయి కానీ, రైతులకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతుబీమా, రైతుబంధు, విత్తనాల పంపిణీ ఆగలేదని గుర్తుచేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదని దుయ్యబట్టారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కేసీఆర్ హయాంలోనే భూసేకరణ కూడా పూర్తయిందని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం భూ నిర్వాసితులకు ఒక్క రూపా యి కూడా చెల్లించలేదని, ఆర్ఆర్ఆర్ ఒక్క అంగుళం కూడా కదలలేదని విమర్శించారు. నష్టపరిహారం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తక్షణమే ఆర్ఆర్ఆర్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం కాదని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని హితవు చెప్పారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.