హనుమకొండ సబర్బన్, భీమదేవరపల్లి, సెప్టెంబర్ 21: ముల్కనూరు ప్రజాగ్రంథాలయం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమెంది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సం యుక్తంగా ఏటా కథల పోటీలు నిర్వహిస్తున్నది. ఇదే తరహాలో నిర్వహించిన ‘కథల పోటీలు-2023’ విజేతల ఎంపిక ప్రక్రియ పూర్తికాగా.. ఆదివారం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇదే వేదికపైనే విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 2014లో ఆ గ్రామ పూర్వ విద్యార్థులు ప్రజాగ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా ఎదగి ముల్కనూరు ప్రజాగ్రంథాలయంగా రూపుదిద్దుకొన్నది. నిత్యం వందలాది మందితో కిటకిటలాడే ఈ గ్రంథాలయం ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైంది.
ముఖ్య అతిథులుగా రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, తెలుగు కవి అందెశ్రీ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి హాజరుకానున్నట్టు నిర్వాహకులు సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ వంగ రవి తెలిపారు.