హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును అటకెక్కించడమే కాకుండా అరకొర పథకాల్లోనూ లబ్ధిదారులపై అప్పుల భారం మోపడమే విధానంగా పెట్టుకున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందంటూ రేవంత్‌రెడ్డి సర్కారు కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడుతున్నదని స్పష్టమవుతున్నది. పథకాల అమలు కోసం లబ్ధిదారులపై భారం మోపుతున్నది. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులపైనా అప్పులభారం మోపేందుకు సిద్ధమైందని తెలుస్తున్నది.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహనిర్మాణం పథకం కింద రూ.5 లక్షల సాయం నాలుగు దశల్లో అందిస్తామని చెప్తున్నది. బేస్మెంట్ పూర్తయిన తర్వాతే నిధులు విడుదల చేస్తామని కండిషన్ పెట్టింది. దీంతో నిర్మాణం మొదలుపెట్టేందుకు అప్పు చేయాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మరో విధానం తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇంటి నిర్మాణం కోసం రూ. లక్ష రుణం ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ రుణాలపై వడ్డీ భారం కూడాఉంటుందని తెలుస్తున్నది.
కేసీఆర్ సర్కారు దళితబంధు కింద రూ. 10 లక్షలు, బీసీబంధు కింద రూ. లక్ష ఒకేసారి గ్రాంట్‌గా ఇచ్చింది. బ్యాంకు జోక్యం, రీపేమెంట్ భారం లేకుండా మొత్తం ప్రభుత్వమే భరించింది. కానీ, కాంగ్రెస్ సర్కారు రాజీవ్ యువవికాసం పథకం పేరుతో రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు ఇస్తామని అంటున్నది. 20 నుంచి 40శాతం డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు కూడా సిబిల్ స్కోర్‌తో లింక్ పెట్టారు. ఇలాంటి కొర్రీలతో పథకం తీసుకొచ్చినా ఉపయోగమేంటని నిరుద్యోగులు వాపోతున్నారు.