(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తారని రాజకీయ పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరానికి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఆదరాబాదరగా ప్రవేశ పెట్టడాన్ని తాజాగా ఉదహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది. వ్యవసాయ పనులు మానుకొని 25 రోజులుగా రైతన్నలు రోజూ సొసైటీల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. అయినా అన్నదాతకు బస్తా యూరియా కూడా దొరకడంలేదు. తెలంగాణకు చెందిన యూరియా ఆంధ్రాకు తరలిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు.. వరదలతో ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. బాధితులను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు, ప్రజలు అధికార కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది గమనించిన రేవంత్.. కొత్త డైవర్షన్ డ్రామాకు తెరతీశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ప్రకటన ఇందులో భాగమేనని చెప్తున్నారు.
కోర్టుకు సెలవు అని తెలిసే!
కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చట్టవిరుద్ధంగా ఉన్నదని ఇంజినీర్లు, సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నివేదికలో ఎక్కడా కూడా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లేనేలేదని గుర్తుచేస్తున్నారు. సెక్షన్-5ఏ కింద, సెక్షన్-8బీ కింద ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో నివేదికలో చెప్పలేదని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ రిపోర్టు న్యాయస్థానాల్లో నిలువబోదని చెప్తున్నారు. ఇది గమనించిన రేవంత్ ప్రభుత్వం.. కోర్టుకు సెలవని తెలిసి.. ఆదివారం పూట ఆదరాబాదరగా శాసనసభలో రిపోర్టును ప్రవేశపెట్టి, దర్యాప్తును సీబీఐకి అప్పగించిందని గుర్తుచేస్తున్నారు. వరదలు, యూరియా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం నివేదిక పేరిట ఇలా మరో డైవర్షన్ డ్రామాకు దిగిందని విమర్శిస్తున్నారు.