హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హస్తం ఉన్నట్టు అనుమానం కలుగుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాల గురించి ప్రవీణ్ కుమార్‌కు తెలుసని, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగేలా ఆయనే ప్రణాళికలు రూపొందించినట్టు అనుమానం కలుగుతుందని ఆరోపించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సరుకుల సరఫరాలో ప్రవీణ్‌కుమార్ రూ.కోట్లలో కుంభకోణం చేశారని, అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతలు చేసే వ్యాఖ్యలపై ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నదని మంత్రి సురేఖ వెల్లడించారు. అన్నింటినీ నమోదు చేసుకొని అందరి లెక్కలూ తేలుస్తామని చెప్పారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే వారెవరినైనా వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకులంలో శైలజ అనే విద్యార్థిని మృతి చెందడంపైనా తమకు అనుమానాలు ఉన్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శైలజ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. అధికారం కోల్పోయామనే ప్రస్ట్రేషన్‌లో కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు.