Paddy Procurement | ఓ దిక్కు వానకాలం దగ్గరికొస్తున్నది.. ఎవుసం పనులు మొదలుపెట్టాల్సిన సమయమిది. కానీ యాసంగి ధాన్యమే కొనేదిక్కు లేక రైతులు రోజుల తరబడి అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం కాంటా వేయకపోవడం, వేసినా మిల్లులకు తరలించకపోవడంతో వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, చివరికి రోడ్లు.. ఎక్కడ చూసినా వడ్లు, మక్కల రాశులు పేరుకుపోయి, వాటిని కాపాడుకొనేందుకు తిండీతిప్పలు మాని నానా అవస్థలు పడుతున్నారు. దారుల వెంట, చెట్ల కింద నిరీక్షిస్తూ దిగులు చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకుండా ప్రభుత్వం నిర్ణక్షంగా వ్యవహరిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి లోనవుతున్నారు. మరోవైపు ఎక్కడ చెడగొట్టు వాన పడి ఉన్నదంతా ఊడ్చుకుపోతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లోని దుస్థితి! మార్కెట్ లోపలే కాదు.. బయట కూడా పోగైన ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు గడువు 10 రోజులే మిగిలి ఉన్నది. కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్న ది. నెలరోజులైనా ధాన్యం కొనకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. యాసంగి కొనుగోలు లక్ష్యంలో ఇప్పటివరకు సగం కూడా కొనలేదు. మక్క, జొన్న ల పరిస్థితీ ఇలాగే ఉన్నది. కల్లాల్లో రైతులు కన్నీళ్లు పెడుతుంటే ఆదుకోవాల్సిన సర్కార్ చేతులెత్తేసింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సీఎం, మంత్రుల తీరు ఉండ గా, రైతుల గోసను పట్టించుకొనే నాథుడే కరువైండు. ఏసీ రూముల్లో సమీక్షలే తప్ప.. కాం టా పెట్టిందీ లేదు.. ధాన్యం తరలించిందీ లే దు. సీఎం, మంత్రులు సమీక్షలు పెట్టి కలెక్టర్లకు ఆదేశాలిస్తారు. వారు అదనపు కలెక్టర్లకు, వారేమో తహసీల్దార్లకు, వారంతా ఐకేపీ కేం ద్రాల నిర్వాహకులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలిస్తారు. ధాన్యం మాత్రం ఎత్తడంలేదు. ‘తౌడు బుక్కే తహసీల్దార్‌కు మీసాల్ దువ్వే మాసూల్దార్’ సామెత చందంగా చెప్పేటొళ్లేగానీ పనిచేసేటొళ్లే కరువయ్యారు. ఇలా పై నుంచి కిందివరకు అందరూ ఆదేశాలిచ్చుకుం టూపోతే.. సమస్యను పరిష్కరించేదెవరు? గన్నీలు, లారీలు, హమాలీలను సమకూర్చేదెవరు? మిల్లుల్లో ధాన్యం లోడ్లను దించేదెవ రు? అన్న మాటలు ప్రశ్నార్థకంగా మారాయి.
ముంచుకొస్తున్న వానగండం
ఓవైపు వాన గండం పొంచి ఉన్నది. ఇప్పటికే అక్కడక్కడ గాలి వానలు కురుస్తూనే ఉన్నాయి. జూన్ 1వ తేదీ నుంచి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా సగం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పటికీ సగం ధాన్యం కల్లాల్లో, రోడ్లపైనే ఉన్నది. ఓవైపు ఎండలు, మరోవైపు సర్కార్ నిర్లక్ష్యంతో నెలల తరబడి కల్లాల్లో ఉండలేక రైతుల్లో ఓపిక నశిస్తున్నది. సర్కార్‌పై ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇంకా కొన్నిచోట్ల సర్కార్‌పై కడుపుమండిన రైతులు ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన తెలుపుతున్నారు.
చేతులెత్తేసిన సర్కార్
సర్కార్ ముందస్తు ప్రణాళిక, ఏర్పాట్లు, వ్యూహం లేకపోవడమే రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపిందనే ఆరోపణలూ వస్తున్నాయి. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన సమస్యగా మా రిందని చెప్తున్నారు. అందుకే లారీలు, గోదాములు, గన్నీల సమస్య ఏర్పడిందనే విమర్శలున్నాయి. గన్నీలు, గోదామలు లేకపోవడం, కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో రైతులు ఎక్కడపడితే అక్కడే రోడ్డెక్కుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కొనుగో లు కేంద్రాలకు వెళ్లేందుకు జంకుతున్నారనే విమర్శలున్నాయి. పరిస్థితి చేయిదాటిపోతున్నదని గ్రహించిన సర్కార్ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సమీక్షల పేరుతో కలెక్టర్లపై చిందులు తొక్కుతున్నారు.
కల్లాల్లోనే రైతుల పడిగాపులు
రైతులు ధాన్యాన్ని అమ్మేందుకు అష్టకష్టా లు పడుతున్నారు. నెలకుపైగా ధాన్యం అమ్మ కం కోసం పడిగాపులు కాయాల్సిన దుర్భర పరిస్థితి నెలకొన్నది. నిబంధనలకు అనుగుణంగా (ఎఫ్ఏక్యూ) ఉన్నప్పటికీ కేంద్రాల నిర్వాహకులు కాంటా పెట్టడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అవసరం మేర గన్నీలు లేక, కాంటా పెట్టిన ధాన్యాన్ని ఎత్తేందుకు హమాలీల కొరతతో, ఎత్తిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు లేక, తరలించిన ధాన్యాన్ని దించేందుకు మిల్లుల్లో చోటులేక కొనుగోళ్ల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఈ దశలో ఎండలకు తాళలేక ఇప్పటికే సుమారు 10 మంది రైతులు తమ ప్రాణాలు విడిచినట్టు వార్తలొచ్చాయి. ఇటీవల ఇద్దరు రైతులు వడ్ల కుప్పపైనే ప్రాణాలు కోల్పోవడం తెలిసింది.
సర్కార్ గొప్పలు.. రైతులకు తిప్పలు
కొనుగోలు ప్రారంభం సందర్భంగా ఏప్రిల్ మొదటి వారంలోనే రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గొప్పగా ప్రకటించారు. తీరా కొనుగోలు ప్రా రంభమైన తర్వాత గానీ సర్కార్ డొల్లతనం బయటపడలేదు. గన్నీలు లేకపోవడం, లారీ లు రాకపోవడం, స్టోరేజీ లేకపోవడంతో అంతా గందరగోళంగా మారింది. వాస్తవానికి ఈ సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేసిన ఆ శాఖ.. సుమారు 25 కోట్ల గన్నీలు అవసరమైనట్టు అంచనా వేసిం ది. 13.5 కోట్లు కొత్తవి, 11.5 కోట్లు పాతవి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కొత్తవి కొనుగోలు చేసిన ఆ శాఖ పాత గన్నీల కొనుగోలులో నిర్లక్ష్యం వహించినట్టుగా తెలిసింది.
మిగిలింది 10 రోజులే
జూన్ 1 నుంచే రాష్ట్రంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నదనే వాతావరణ శాఖ ప్రకటనతో రైతుల్లో ఆందోళన మరింత పెరుగుతున్నది. ఇప్పటికీ సగం ధాన్యం ఇంకా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే మూలుతుగుతున్నది. అంటే రుతుపవనాల రాకకు ఇంకా 10 రోజుల సమయమే ఉన్నది. ఈ పది రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తుం దా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తే రైతులకు తీరని నష్టం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్ నిర్లక్ష్యంపై రైతులు సైతం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.వెళ్లి.. కలెక్టర్ కాళ్లు మొక్కండి
నా కాళ్లు మొక్కితే ఏం లాభం? ; రైతులకు సూచించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్

కాంటా పెట్టి 15 రోజులైనా ధాన్యాన్ని గోదాముకు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతం మేడం.. లారీలు పంపండి’ అంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ..‘నా కాళ్లు కాదు.. వెళ్లి కలెక్టర్ సారు కాళ్లు’ మొక్కండి’ అనడంతో రైతులు ఆమెపై మండిపడ్డారు. కాళ్లు మొక్కితేనే లారీలు పంపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం నెన్నెల మండ లం గొల్లపల్లి కేంద్రం వద్ద లారీల కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు. అక్కడికి వచ్చిన ఆర్ఐ సులోచనను రైతులు ప్రాధేయపడ్డారు. ‘నా కాళ్లు కాదు.. సార్ కాళ్లు మొక్కండి’ అంటూ బదులిచ్చిన మాటలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడంతో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటివరకు నాలుగు వేల బస్తాల వడ్లను కాంటా వేసినా, కేవలం రెండు లారీల బస్తాలనే మిల్లులకు తరలించారని మండిపడ్డారు. మిగతా బస్తాలను తరలించేందుకు లారీలు రావడం లేదని, వర్షాలకు వడ్లు తడిస్తే ఎవరు బాధ్యులను ప్రశ్నించారు.
ఎక్కడి ధాన్యం అక్కడే

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన ధాన్యం కుప్పలపై వర్షాల భయంతో ముందస్తుగా కవర్లు కప్పిన రైతులు
గంజ్కే పరిమితం

లారీల కొరతతో కామారెడ్డిలోని గాంధీ గంజ్‌లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలు
లారీ వచ్చేదెప్పుడో..?

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లో యార్డులో పేరుకుపోయిన ధాన్యం బస్తాలు
కదలని ధాన్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె, బద్దెనపల్లిలో ధాన్యం రాశులు ఇంకా కల్లాలు, రోడ్లు, ఇండ్ల ముందే దర్శనమిస్తున్నాయి.
కొనేవారేరి?

నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డు ఆవరణలో ఇబ్బడిముబ్బడిగా ధాన్యం రాశులు
లోడ్ దించేదెన్నడో..?

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీలోని ఓ రైస్ మిల్ వద్ద బారులు తీరిన వడ్ల లోడు లారీలు
తాలు తీసినా..

సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో ఎండలోనే పొల్లు పడుతున్న రైతులు
అలసితివా

అన్నదాతా నారాయణపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్లో ధాన్యం కాంటా కోసం ఎదురుచూస్తూ బస్తాలపైనే నిద్రిస్తున్న రైతు
మార్కెట్ దాటని ధాన్యం

జనగామ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో భారీగా పేరుకుపోయిన ధాన్యం రాశులు
దుమ్ముతో నిండిన కండ్లు

యాదాద్రి జిల్లా కట్లెపల్లిలోని కేంద్రంలో దుమ్ముధూళితో కండ్లు ఎర్రబడ్డాయని చూపిస్తున్న లారీ డ్రైవర్