హైదరాబాద్,డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సాధారణంగా ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి రాజకీయాలకు తావులేకుం డా ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వ పథకాలను కూడా తన రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నది. ఈ నే పథ్యంలో తాజాగా ఇందిరమ్మ చీరల పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు(డీసీసీ)లకు కట్టబెట్టింది. దీంతో ప్రభుత్వ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాల కోసం ఎదురుచూసే ప్రజలకు ఇప్పుడు పార్టీ ప్రమేయంతో తమ వరకు వస్తాయో లేదోనని ఆలోచనలో పడ్డారు.
మంగళవారం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, మంత్రులు, నూతన డీసీసీ అధ్యక్షులు, పూర్వ డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల చివరినాటికి గ్రామీణ ప్రాంతాల్లో 65లక్షల ఇందిరమ్మ చీరలు, మార్చినాటికి పట్టణాల్లో 35 లక్షల చీరలు పంపిణీని పూర్తిచేయాలని, ఈ బాధ్యతంతా డీసీసీ అధ్యక్షులదేనని తేల్చిచెప్పారు.
తెలంగాణకు బుల్లెట్ రైలు ఇస్తవా? చస్తవా?
తెలంగాణకు బుల్లెట్ రైలును ‘ఇస్తవా? చస్తవా?’ అని ప్రధాని మోదీని నిలదీస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. నరేంద్రమోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నారని, ఆ తర్వాత పుణె నుం చి ముంబైకి వేస్తున్నారని తెలిపారు. మీ రాష్ర్టానికి వేసుకున్నప్పుడు మా రాష్ర్టానికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, చెన్నైకి బుల్లెట్ ట్రైన్ కూడా మంజూరు చేయించానని తెలిపారు. అదే విషయాన్ని ప్రధానిని కలిసి ‘ఇస్తవా? చస్తవా?’ అని అడగడానికి ఢిల్లీ వెళ్తున్నానని తెలిపారు.
59వసారి ఢిల్లీకి సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్రమోదీని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానించనున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఇది 59వసారి.