హనుమకొండ, డిసెంబర్ 22: ఎన్నికల హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి గత బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని పండుగలను అధికారికంగా నిర్వహించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో పేదల ఇళ్లు కూలగొడుతున్నదని, లగచర్లలో రైతుల భూములను లాక్కుంటున్నదని, సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలించే శక్తి లేక ప్రతిపక్షంపై ఎదురు దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ రాముడయితే.. సీఎం రేవంత్‌రెడ్డి రావణుడని పోల్చారు.