వరంగల్: విభజన చట్టం హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బదులు కేంద్రం వ్యాగన్ ఫ్యాక్టరీకి అనుమతించిందని విమర్శించారు. వ్యాగన్ ఫ్యాక్టరీ తమవల్లే వచ్చిందని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆ పార్టీ ఏనాడూ డిమాండ్ చేయలేదన్నారు. వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటులో హస్తం పార్టీ పాత్ర శూన్యమని చెప్పారు. వరంగల్ ఖాజీపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విభజన చట్టంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేంద్రం పలు హామీలు ఇచ్చింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీకి హామీలు ఇచ్చింది. అయితే వాటి అమలులో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. కోచ్ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నది. కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని పార్లమెంటులోనే కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో ఎన్నికలు ఉండటంతో లాతూరుకు కోచ్ ఫ్యాక్టరీని ఇచ్చారు.
దగ్గరలో ఉన్న విజయవాడ, గుంటూరుకు రైల్వే డివిజన్ ఇచ్చారు. కాజీపేటను రైల్వే డివిజన్ చేయాలని అడిగితే మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ జంక్షన్ పరిధిలో రైల్వేకు అత్యధిక ఆదాయం వస్తున్నది. ఇందిరాగాంధీ హయాంలోనే కాజీపేట రైల్వే డివిజన్ అంగీకరించారు. ఇక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీకి కేసీఆర్ 160 ఎకరాలు కేటాయించారు. కాజేపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటం కొనసాగిస్తాం. విభజన చట్టంలోనే కేసీఆర్ కోచ్ ఫ్యాక్టరీ హామీ పెట్టించారు. కాగా, వ్యాగన్ ఫ్యాక్టరీ తమ వల్లే వచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆ పార్టీ ఏనాడూ డిమాండ్ చేయలేదు. వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఏమీలేదు.
నగరంలోని బోడగుట్టలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. దీనికి అయ్యే రూ.10 కోట్ల ఖర్చులో రాష్ట్రం నుంచి రూ.5 కోట్లు ఇస్తామని గత ప్రభుత్వం తెలిపింది. కాజీపేటలో రూ.50 కోట్లతో రైల్వే ఓబర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించాం. ఈ ప్రాంతం అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేశాం. స్థానికులకు 60 శాతం ఉద్యోగాల కోసం పోరాడుతాం. చిరు వ్యాపారులకు రైల్వే స్థలంలో స్టాల్స్ నిర్మించాలి. దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. బీజేపీవన్నీ హామీలు తప్ప ఆచరణ శూన్యం.
Live: ఖాజీపేటలో వరంగల్ బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం. https://t.co/6s1UlV5MwN
— BRS Party (@BRSparty) November 30, 2024