Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు పన్నుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. న్యాయస్థానం సాక్షిగా విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన GO Ms No.9 విద్యార్థుల సంక్షేమం కోసం ఉద్దేశించింది కాదని.. అది కేవలం ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ఒక రాజకీయ మాయాజామని విమర్శించారు. ప్రభుత్వం వందల కోట్ల ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను క్లియర్ చేయకుండా తన వద్దే పెట్టుకుందని అన్నారు.
మరోవైపు, ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదంటూ చట్టపరమైన ఆంక్షలు విధించింది. అంటే… ఖజానా ఖాళీ చేసిన తన తప్పును కాలేజీల మీదకు నెట్టేస్తూ, తానేదో పేద విద్యార్థుల రక్షకుడిలా ప్రభుత్వం డ్రామాలు ఆడిందని దాసోజు శ్రవణ్ అన్నారు. హైకోర్టు ఈ జీవోపై స్టే ఇవ్వడం వెనుక ఉన్నది కేవలం ఒక తప్పుడు విధానాన్ని అడ్డుకోవడం మాత్రమే కాదని; ప్రభుత్వ చేతకానితనాన్ని నిలదీయడం కూడా అని తెలిపారు. కాలేజీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ… జీతాలు ఎలా కట్టాలి? కాలేజీలు ఎలా నడపాలి? అని కోర్టు ప్రశ్నించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. కాలేజీలను ఆర్థికంగా దెబ్బతీస్తే విద్యా ప్రమాణాలు పడిపోతాయని.. క్యాంపస్ ప్లేస్మెంట్లు ఆగిపోతాయని తెలిపారు. చివరికి నష్టపోయేది పేద విద్యార్థులే అని స్పష్టం చేశారు.
ఇది కేవలం పరిపాలనాపరమైన వైఫల్యం కాదని.. ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని లోపల నుంచే బలహీనపరిచి, పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వం పన్నిన ఒక క్రమబద్ధమైన కుట్రలా కనిపిస్తోందని దాసోజు శ్రవణ్ విమర్శించారు.
➡️ ఆర్థికంగా గొంతు నొక్కడం: బడ్జెట్ నిధులను నెలల తరబడి విడుదల చేయకుండా కావాలనే ఒక కృత్రిమ సంక్షోభాన్ని ప్రభుత్వం సృష్టిస్తోంది.
➡️ బాధ్యత నుంచి తప్పించుకోవడం: కాలేజీలపై ఆంక్షలు పెట్టడం ద్వారా, ప్రైవేట్ యాజమాన్యాలను విలన్లుగా చిత్రీకరిస్తోంది. తద్వారా తన ఆర్థిక దివాలా కోణాన్ని ప్రజలకు తెలియకుండా పొలిటికల్ షీల్డ్‌లా వాడుకుంటోంది.
➡️ అసలు లక్ష్యం ఇదే: ఫీజు రీఇంబర్స్మెంట్ విద్యార్థులను చేర్చుకోవడం కాలేజీలకు భారం అయ్యేలా చేయడం. తద్వారా వ్యవస్థే స్వయంగా కుప్పకూలిపోయేలా చేయడం. ఈ పథకాన్ని నేరుగా రద్దు చేస్తే ప్రజల్లో వచ్చే ఆగ్రహాన్ని తట్టుకోలేక, ఇలా అడ్డదారిలో పథకానికి మంగళం పాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ జీవో హైకోర్టులో వీగిపోవడం వెనుక ప్రభుత్వ అసమర్థత మాత్రమే కాదు… విద్యార్థుల పట్ల దానికి ఉన్న చిత్తశుద్ధి లేమి స్పష్టంగా కనిపిస్తోందని దాసోజు శ్రవణ్ తెలిపారు. ఒకవేళ ప్రభుత్వానికి నిజంగానే పేద విద్యార్థుల ప్రయోజనాలే పరమావధి అయి ఉంటే, వారు తీసుకోవాల్సిన ఉత్తమమైన మార్గం: కోర్టులో జీవో 9ని చట్టబద్ధంగా అభిషేక్ సింగ్వీ లాంటి సీనియర్ అడ్వొకేట్లను నియమించి, బలంగా సమర్థించుకోవడం, అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న వందల కోట్ల ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయడం అని స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. కోర్టు ముందు సరైన వాదనలు వినిపించకుండా, బలహీనమైన వాదనలతో కావాలనే చేతులెత్తేసిందని తెలిపారు. ఇదంతా ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ప్లాన్ అని అన్నారు.
➡️ కాలేజీలతో ‘డర్టీ వర్క్’ చేయించడం: కాలేజీలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఆడుతున్న తెరవెనుక నాటకం: ప్రభుత్వం తానే స్వయంగా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను నిలిపివేస్తే తీవ్ర ప్రజా వ్యతిరేకత వస్తుంది. అందుకే, కోర్టులో GO 9 ని సరిగ్గా డిఫెండ్ చేయకుండా చేతులెత్తేసింది.
➡️ విద్యార్థులను బలిచేయడం: ప్రభుత్వం కావాలనే కోర్టులో ఓడిపోవడం వల్ల, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల పేరిట ‘బుల్డోజర్’ లాంటి ఒత్తిడిని తీసుకువస్తున్నాయి. పేద విద్యార్థులు తక్షణమే ఫీజులు కట్టక తప్పని దుస్థితిని ప్రభుత్వం స్వయంగా సృష్టించింది.
• కోర్టుల వెనుక నక్కిన సర్కార్: “మేము జీవో తెచ్చాం, కానీ కోర్టు స్టే ఇచ్చింది” అని చేతులు కడుక్కోవడానికి ఈ వైఫల్యాన్ని ఒక సాకుగా వాడుకుంటున్నారు.‘ అని దాసోజు శ్రవణ్ తెలిపారు.
నిజమైన సంక్షేమం అంటే చేతల్లో ఉండాలి.. ఖాళీ హామీలు, చట్టపరమైన డ్రామాల్లో కాదని దాసోజు శ్రవణ్ తెలిపారు. 15% శాతం బడ్జెట్ విద్య కోసం కేటాయిస్తానని నమ్మబలికి, గద్దెనెక్కి, విద్యా వ్యవస్థను, విద్యార్థులను పూర్తిగా విస్మరించిన ఘనత రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. ఖజానా ఖాళీ అని కుంతి సాకులు చెబుతూ, కాలేజీల ద్వారా విద్యార్థుల జేబులను గుల్ల చేయిస్తోందని మండిపడ్డారు. కోర్టులను అడ్డుపెట్టుకుని విద్యార్థులను కాలేజీల ముందు బలిపశువులను చేయడం ఆపి… ప్రభుత్వం తెలంగాణ క్లాస్‌రూమ్‌లతో రాజకీయం చేయడం ఆపాలని సూచించారు. తక్షణమే బకాయిలన్నీ చెల్లించి, విద్యార్థుల భవిష్యత్తును తన అప్పుల తలసరి భారంగా చూడటం మానేయాలని డిమాండ్ చేశారు.