మేడ్చల్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 61.85 శాతం మాత్రమే డిజిటైజేషన్ నమోదైన నేపథ్యంలో సుమారు 10 లక్షలకు పైగా ఓటర్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎల్ఓలు ఇచ్చిన ఫారాలు నింపి తిరిగి బీఎల్ఓలకు అందించడంలో ఓటర్లు అసక్తి చూపడం లేదని సమాచారం.
వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నివాసం ఉంటున్న ప్రజలు సోంతూళ్లలోనే ఓటు హక్కుకు ప్రాధాన్యత ఇస్తుండటంతోనే ఇక్కడ తీసుకున్న ఫారాలు తిరిగి ఇవ్వడం లేదని తెలుస్తోంది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 18,42,553 మంది ఓటర్ల డిజిటైజేషన్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రజలు వలసవచ్చి నివసించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ స్ంథలలో ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ ఇక్కడ ఓటు హక్కు ఉండటంతో పాటు వారి సొంతూళ్లలో కూడా ఓటు హక్కు ఉన్నట్లు సమాచారం. వీరిలో అనేకమంది సొంతూళ్లలో ఓటు హక్కు ఉంచుకోవడానికే అసక్తి చూపుతున్నారు.
దీంతో సర్ కార్యక్రమానికి మరో 8 రోజులు గడువు ఉన్నప్పటికీ డిజిటైజేషన్ నమోదు అంతంత మాత్రంగానే జరిగే అవకాశం ఉంటుదన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఎంత జరిగినా 70 శాతం మాత్రమే జిల్లాలో డిజిటైజేషన్ జరగవచ్చనే అంచనాలో ఇటు అధికారులు.. అటు వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. మెజార్టీ ఓటర్లు ఫారాలు తిరిగి తీసుకోవాడానికి వచ్చిన బీఎల్ఓలను తిప్పి పంపుతున్నారని ఫారాలు ఇవ్వడం లేదని సమచారం. దీంతో జిల్లాలో సుమారు 10 లక్షలకు పైగా ఓట్లు తగ్గే అవకాశం ఉంది.