Dasoju Sravan | బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన అహంకారపూరిత, అవహేళన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గానీ, ఇక్కడి ప్రగతి ప్రస్థానం గానీ తెలియని పొంగులేటి.. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి నిస్సిగ్గుగా, చిల్లర జ్యోతిష్యాలు చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు.
పొంగులేటి.. కొత్తగా జ్యోతిష్యం ఏమైనా నేర్చుకున్నావా? అని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. మా పొలిటికల్ ఫ్యూచర్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకెక్కడిది పొంగులేటి అని మండిపడ్డారు. సలు నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలుసా.. త్వరలోనే మీ అవినీతి లీలలన్నీ బట్టబయలై, జైలు ఊచలు లెక్కబెట్టడమే నీ ఫ్యూచర్ అని వ్యాఖ్యానించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. నువ్వు చేస్తున్న అక్రమాలు, వెనుక ఉండి నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా దందాలకు.. నీ ఫ్యూచర్ మరో రెండేళ్లు దాటితే చర్లపల్లి జైల్లోనే ఉంటుంది. రాసి పెట్టుకో అని హెచ్చరించారు.
కళ్ళు తెరిచి చూడు పొంగులేటి.. కుంభకర్ణ నిద్రపోతున్నావా అని మండిపడ్డారు. పదేళ్లలో ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టలేదని బీఆర్ఎస్పై విమర్శలు చేయడానికి సిగ్గుండాలని అన్నారు. అసలు కళ్ళు ఉండి చూస్తున్నావా, లేక అధికార అహంకారంతో కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయా అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి మెట్రో ప్రాజెక్టును తెచ్చి, రికార్డు సమయంలో ఫేజ్-1 పూర్తి చేసి చూపించింది నాటి కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఫేజ్-2 కి సంబంధించిన అన్ని ప్రణాళికలు, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేస్తే.. ఈరోజు అధికారంలోకి వచ్చిన మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎల్&టీ (L&T) లాంటి ప్రతిష్టాత్మక సంస్థను బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి ప్రాజెక్టులను అతలాకుతలం చేస్తుంది నిజం కాదా? దీనికి ఏం సమాధానం చెబుతావని నిలదీశారు.
ఫ్యూచర్ సిటీ కాదు.. అది ‘ఫేక్’ సిటీ.. ల్యాండ్ మాఫియా అడ్డా అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రపంచ దేశాలు మెచ్చేలా, ఉపాధి కల్పనే ధ్యేయంగా నాడు కేసీఆర్ తెచ్చిన గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సిటీని రద్దు చేసి.. ఈరోజు ‘ఫ్యూచర్ సిటీ’ అనే రంగుల ప్రపంచం పేరుతో మీరు చేస్తోంది ఏంటి?అని ప్రశ్నించారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేద ప్రజల, గిరిజనుల, రైతుల నోళ్లు కొట్టి వారి భూములను అక్రమంగా లాక్కోవడమే మీ ఫ్యూచర్ సిటీ వ్యూహమా? అని నిలదీశారు.
ఫ్యూచర్ సిటీ ముసుగులో వేల కోట్ల రూపాయల అవినీతికి, ల్యాండ్ పూలింగ్ స్కామ్‌లకు తెరలేపారని అన్నారు. నాదర్గుల్, లగచర్లలో రైతులను బెదిరించి, వారిపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి, వారిని వేధిస్తున్న మీ నిరంకుశత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని అన్నారు. మీ భూ కబ్జాలు, మీ HILTP పాలసీ పేరుమీద ఇండస్ట్రియల్ మాఫియా దందాలన్నీ త్వరలోనే ఆధారాలతో సహా బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి, పొంగులేటి.. మీ ఇద్దరి ఫ్యూచర్ జైల్లోనే! ఇందులో ఎలాంటి సందేహం లేదని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో హరీష్ రావు, కేటీఆర్ ఉంటారని తెలిపారు. హరీశ్ రావు, కేటీఆర్ తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు రెండు కళ్ళు అని పేర్కొన్నారు. రాష్ట్ర అస్తిత్వం కోసం, స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమ కాలం నుంచి ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధపడిన కడిగిన ముత్యాల్లాంటి నాయకులు. తెలంగాణ చరిత్ర పుటల్లో వారి పేర్లు శాశ్వతంగా, సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయి. అది వారి అజేయమైన ఫ్యూచర్ అని స్పష్టం చేశారు. కానీ మీ ఫ్యూచర్ ఏంటి పొంగులేటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సంపదను దోచుకుంటున్న దోపిడీదారులుగా, రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు తాకట్టు పెట్టిన దగాకోరులుగా మీ పేర్లు చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతాయని అన్నారు. మీకు జైలే ఫైనల్ ఫ్యూచర్! అని ఎద్దేవా చేశారు.
మీ అక్రమ పాలనకు, దగాకోరు రాజకీయాలకు ఇంకో రెండేళ్లు మాత్రమే గడువు ఉందని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. ఎంత ఎంజాయ్ చేస్తావో చేసుకో, ఎంత దోస్తావో దోచుకో పొంగులేటి.. ఆ తర్వాత ప్రజల పక్షాన ప్రతి పైసా లెక్క తేలుస్తాం.. మీ నుండి కక్కిస్తామని అన్నారు. మిమ్మల్ని చర్లపల్లి జైలు ఊచలు లెక్కపెట్టించడం ఖాయమని వ్యాఖ్యానించారు.