Dasoju Sravan | హిట్లర్ తనకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. హిట్లర్ను అనుకరిస్తూ తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేయడం, నివాస గృహాలను అక్రమంగా కూల్చివేయడం వంటి చర్యలకు పాల్పడటం నిరంకుశత్వం, అప్రజాస్వామికమని అన్నారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఎగతాళి చేయడమేనని పేర్కొన్నారు.
ఈ దౌర్జన్యపూరిత హిట్లర్ సిద్ధాంతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సరికొత్త విధానమా? లేక రేవంత్ రెడ్డి కొనుగోలు చేసిన ప్రత్యేక కాంగ్రెస్ ఫ్రాంచైజీ భావజాలమా? అని అనుమానం కలుగుతోందని దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రజాస్వామ్యం అంటే జీవితాలను నాశనం చేయడం, నిర్మూలించడం కాదని తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే మానవ హక్కులను కాపాడటం, ప్రతి ఒక్కరూ గౌరవం, స్వేచ్ఛ, సోదరభావం, న్యాయంతో ‘బతుకు, బతకనివ్వు‘ అనే విధంగా జీవించేలా చూడటమని స్పష్టం చేశారు.
ప్రపంచానికి జై సంవిధాన్ అని లెక్చర్లు ఇచ్చే ముందు.. తమ సొంత ముఖ్యమంత్రికి ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలను నేర్పించాలని రాహుల్ గాంధీకి సూచించారు. దశాబ్దాల క్రితమే హిట్లర్ను ప్రపంచం తిరస్కరించిందని గుర్తుచేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి అహంకారంతో ఎంతగా కళ్లు మూసుకుపోయారంటే.. పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడానికి, ఒక నియంత నుంచి ప్రేరణ పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిది ఎంతటి అవమానకరమైన, సిగ్గుచేటైన విలువల వ్యవస్థ అని మండిపడ్డారు.