హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన ముసుగులో రియల్ఎస్టేట్ మాఫియా సర్కార్ నడుపుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. రేవంత్‌కు భజన చేసే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అక్రమ భూములను రెగ్యులరైజ్ చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రాచారితో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన వెంటనే గాజులరామారం పరిధిలోని సర్వే నంబర్ 307లోని అరెకపూడి గాంధీకి చెందిన 11 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేశారని ఆరోపించారు. పార్టీ మారిన అరికెపూడికి రేవంత్‌రెడ్డి నజరానా ఇచ్చారని, భూ భారతిలో ఆయన పేరిట ఎంట్రీ చేశారని విమర్శించారు.
బాధ్యత కలిగిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దీనిపై సీసీఎల్ఏ, సీఎస్, కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా, విజిలెన్స్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు. చర్యలు తీసుకుంటానన్న హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేసిన తెల్లారే హద్దులు వేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఐడీపీఎల్ మొత్తం భూమిపై విచారణ చేస్తున్నామని చెప్పి, ఇప్పుడు ఒకేఒక్క సర్వే నంబర్లోని స్థలాలపై విచారణ చేస్తున్నారని ఆరోపించారు. మరీ అరెకపూడికి చెందిన భూమిపై విచారణ ఎందుకు చేయడంలేదని నిలదీశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోని భూముల్లో కార్యకలాలపాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలి.. తెల్లారిలేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో 66% సీట్లు సాధించామని గొప్పలు చెప్తున్న రేవంత్‌కు దమ్ముంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా పదిలంగా ఉన్నట్టు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను మరోసారి చూడాలనే ఆకాంక్ష బలంగా ఉన్నదని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. గెలిచిన వాళ్లు ప్రజల నమ్మకాన్ని బలపరిచేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఐక్యత, ఉత్సాహంతో పని చేస్తే ఘన విజయం సాధ్యమని విశ్వాసం వ్యక్తంచేశారు. అధికార పార్టీ ఆగడాలను తట్టుకుని గెలిచిన ప్రజాప్రతినిధుల విజయం కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల పోరాటం ప్రశంసనీయమని కొనియాడారు.