హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): పది అడుగుల దూరం రోడ్డు దాటినందుకు అనధికార ర్యాలీ నిర్వహించారని కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. 9న కేటీఆర్‌పై పనికిమాలిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకార ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు.
డిసెంబర్ 18న రాజ్‌భవన్, 19న ఈడీ ఆఫీస్ ముందు వేలాది మందితో నిరసనలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారని గుర్తుచేశారు. ఈ నిరసనలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. సీఎం నిరసన ఫొటోల క్లిప్పింగులను ఆయన ఎక్స్ ఖాతాలో జతచేశారు. రాజకీయ ప్రతీకారం కోసం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ప్రజల విశ్వాసం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఇదంతా కనిపించడంలేదా? అంటూ డీజీపీ, హైదరాబాద్ సీపీ, కమిషనర్‌కు ఆయన తన ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.