హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాచికల్లు తాగినోళ్లలా మాట్లాడుతున్నారని, కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్టు వీధిరౌడీల్లా తూలనాడితే తాటతీస్తామని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముక్కలుగా నరుకుతాం, బుల్డోజర్లతో తొక్కిస్తాం.. అని కాలకేయుడిలా మాట్లాడితే మర్యాద దక్కదని హితవుపలికారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిపై సుమోటోగా కేసు పెట్టి జైల్లో వేయాలని పోలీసులకు సూచించారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ 40 ఏండ్లకుపైగా ప్రజాజీవితంలో ఉన్నారని, పదవులను త్యాగం చేసి రాష్ర్టాన్ని సాధించారని, పదేండ్లు సీఎంగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు.
తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌పై సంగెంలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్టు చెప్పారు. మూసీని అభివృద్ధిని కేటీఆర్, హరీశ్‌రావు ఎప్పుడైనా వద్దన్నారా? అని నిలదీశారు. డీపీఆర్ లేకుండా ఇండ్లు కూలుస్తున్నారని, మూసీ అభివృద్ధి పేరుతో జీవన విధ్వంసం చేస్తున్నారని, మూసీ ప్రాజెక్టును అదానీ, మెగా కృష్ణారెడ్డికి అప్పగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
‘పేదల ఇండ్లు కూల్చివేసి అడ్డుగోలుగా వ్యవహరిస్తామంటే ఊరుకోబోం.. ప్రజలపక్షాన పోరాడుతామని చెప్పినం.. దానికి ముక్కలుగా నరుకుతం.. కుక్కచావు చస్తరు, ఇంత సైకో తరహాలో మాట్లాడుతారా? బుల్డోజర్లతో తొక్కిస్తామని ఎలా అంటారు? గంజాయి, డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నరా? మీరు రాష్ట్ర యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? రేవంత్‌రెడ్డికి బుద్ధి, జ్ఞానం ఉన్నదా? రేవంత్‌రెడ్డిని మహిళలు దారుణంగా తిడున్నరు. ఆ తిట్లు వింటే ఆయన చెవుల నుంచి రక్తాలు కారుతయి. మూసీ అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి కేసీఆర్‌ను తిట్టడానికే పాదయాత్ర చేపట్టినట్టు ఉన్నది’ అని శ్రవణ్ ధ్వజమెత్తారు.
‘తెలంగాణ మీ అయ్య జాగీరా? మూసీ బాధిత ప్రజలకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని అడిగితే బుల్డోజర్లు ఎక్కించి చంపుతానంటవా?.. బుల్డోజర్లు ఎక్కించి చంపడానికేనా నువ్వు ముఖ్యమంత్రి అయింది?’ అని రేవంత్ నిలదీశారు. ‘ఈ దేశంలో ఎవరు ఏది మాట్లాడినా చెలామణి అవుతున్నది.. ఇది మన దురదృష్టం. అదే లండన్లోనో, అమెరికాలోనో ఇలా మాట్లాడితే జైలు ఊచలు లెక్కించాల్సిందే’ అని హెచ్చరించారు. ‘కోమటిరెడ్డీ.. ఫ్లోరైడ్ బాధితులను ఎప్పుడైనా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడినవా? అని నిలదీశారు. అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్, కోమటిరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.