హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి వల్లే యాదయ్య, వేణుగోపాల్‌రెడ్డి లాంటి వాళ్లు ఆత్మబలిదానాలు చేశారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓయూకు వెళ్లినా సీఎం తీరు మారలేదని, ఎప్పటిలాగే కేసీఆర్‌పై విషంకక్కాడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యాంపస్‌లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం మొత్తం గందరగోళంగా ఉన్నదని, ఒకదానికొకటి పొంతన లేకుండా, విషపూరిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తరచూ నల్లమల నుంచి వచ్చాను, క్రూరమృగాలతో ఆడుకున్నా అని చెబుతుంటారని, అంటే క్రూరుణ్ణి అనే సందేశాన్ని ప్రతిసారి ఇస్తున్నారని దుయ్యబట్టారు.
సీఎం హోదాలో ఇలాం టి మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. ఇంటిగ్రెటెడ్ స్కూళ్ల ఏర్పాటు పేరుతో, కేసీఆర్ స్థాపించిన గురుకులాలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నారని తూర్పారబట్టారు. సామాజిక న్యాయం పేరుతో ముఖ్యమంత్రి పెద్ద డ్రామా ఆడుతున్నాడని, 42శాతం రిజర్వేషన్లపై బీసీల గొంతు కోసి, తిరిగి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా ఉండే ఓయూకు వచ్చి, ఇంగ్లిష్ అవసరం లేదన్న రేవంత్‌రెడ్డి వైఖరిని తప్పుబట్టారు. రాహుల్‌గాంధీ ఇంగ్లిష్ ప్రాధా న్యం గురించి చెబుతుం టే, రేవంత్ వద్దంటున్నారని మండిపడ్డారు. సమ్మిట్‌లో రేవంత్ బట్టలు చూసి ఎవరైనా పెట్టుబడులు పెడుతారా? అని విమర్శించా రు. రేవంత్ కన్నా చిరంజీవే నయమని పేర్కొన్నారు. 3 ట్రిలియన్ల ఎకానమీ గురించి మా ట్లాడుతాడు కానీ, మూడు రూపాయల మైండ్‌సెట్‌తో సాధ్యమా? అని ఎద్దేవా చేశారు.