కాగజ్‌నగర్/ఆసిఫాబాద్ టౌన్, జనవరి 29 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతగాకే బీఆర్ఎస్పై బురదజల్లుతూ.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని జిల్లా ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ పిత, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు సిట్ నోటిసులు ఇవ్వడం బాధాకరమని, ఆయన చావుకు సిద్ధపడి తెలంగాణ తెస్తేనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని పేర్కొన్నారు. ప్రస్తుతం పాలన గాడి తప్పుతుందని స్పష్టంచేశారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఏదో ఒక డ్రామా ఆడటం రేవంత్‌కు పరిపాటిగా మారిందని విమర్శించారు. ప్రజల్లో నమ్మకంపోయినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సరికాదని, ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు చేసే చట్టబద్ధమైన పని అని, ఆ సమాచారాన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఇవ్వకూడదని, ఇచ్చినా.. అది చట్టవిరుద్ధమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు గద్దెదించబోతున్నారని జోస్యం చెప్పారు.