హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణను కించపరిచేందుకే కాంగ్రెస్ శ్వేతపత్రాల పేరుతో కొత్త డ్రామాలకు తెరతీసిందని బీఆర్ఎస్ సీనియన్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. శ్వేతపత్రాలు తెలంగాణను వ్యతిరేకించే ఆంధ్ర మేధావులు, పెట్టుబడిదారులు, తెలంగాణద్రోహులు అందరూ కూడగట్టుకుని తయారు చేసినట్టే ఉన్నాయని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందితే మరి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎందుకు పుట్టుకొచ్చేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు తెలంగాణ ఉద్యమాన్ని, అస్థిత్వాన్ని, అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ఉన్నదని విమర్శించారు.
కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీద అకసుతో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం భవిష్యత్ పారిశ్రామిక పెట్టుబడులకు విఘాతం కలిగించే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. శ్వేతపత్రాల విడుదలకు కోట్ల రూపాయల ఖర్చుతో అసెంబ్లీ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. మీడియా ద్వారా ఆ పత్రాలు విడుదల చేస్తే సరిపోయేది కదా? అని పేర్కొన్నారు. తప్పు జరిగితే విచారణకు ఆదేశించడానికి అసెంబ్లీ సమావేశాలు వేదిక కావాలా? అని నిలదీశారు. తెలంగాణ అప్పుల పాలైందనే ప్రచారంతో రాష్ట్ర భవిష్యత్ అంధకారమయ్యే అవకాశం ఉన్నదని, మళ్లీ చీకట్లు కమ్ముకునే ప్రమాదం పొంచి ఉన్నదని.. ఇకనైనా రాజకీయ స్వార్థాలను పక్కనపెట్టి తెలంగాణ భవిష్యత్ కోసం ముందుకు సాగాలని హితవు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.