హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించి, ఆమోదం కోసం పంపిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర గవర్నర్ వెనక్కి పంపినట్టు తెలిసిందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ వారి హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రపతి వద్దనున్న బీసీ బిల్లును, గవర్నర్ వద్దనున్న ఆర్డినెన్స్‌ను వెనక్కి పంపితే వెనుకబడిన వర్గాల వారి గుండెల్లో రాయి పడినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ బిల్లుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కులగణనపై జరిగిన సర్వే వివరాలు, కమిషన్ నివేదికలను బయటపెట్టాలని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సాకుతో రాష్ట్రంలో కులగణన చేశారని, ఆ తర్వాత ఒక కమిటీ కూడా వేశారని, ఇందుకోసం దాదాపు రూ.160 వరకు కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు.
ఈ కసరత్తులో లక్షమంది వరకు ఉద్యోగుల సేవలు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ కమిటీ ఇచ్చిన నివేదికను బయటపెట్టలేదని ఎందుకో దానిని రహస్యంగా ఉంచుతున్నారని అన్నారు. ఆ నివేదికను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీల మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే మరోపక్క ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలో విన్యాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ నిబద్ధతను విస్మరించి సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.