Vemulawada | కరీంనగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భక్తులకు వేములవాడ రాజన్న ప్రత్యక్ష దర్శనాలు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుండంలో స్నానాలు చేసి, తడి బట్టలతో రాజన్న దర్శనం, కోడె మొక్కులు చెల్లింపు నిలిపివేతకు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులను విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది. గుడిబయట ప్రచార రథం, ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. అధికారులు మాత్రం భక్తులకు ఎలాంటి స్పష్టతనివ్వడంలేదు. వచ్చే ఏడాది జనవరిలో సమ్మక్క సారలమ్మ జాతర ఉంది.
ఈ జాతరకు వెళ్లేముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. కానీ ఆలయ అభివృద్ధి పేరిట దాగుడు మూతలు ఆడుతున్న ప్రభుత్వం, అధికారులు గుడి మూసివేత, భక్తులకు దర్శనాల నిలిపివేతపై రకరకాలుగా ప్రకటనలు ఇస్తున్నది. దీంతో భక్తులంతా గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శృంగేరి పీఠం ఉత్తరాధికారి విధుశేఖరభారతి గత శని, ఆదివారాల్లో ఆలయాన్ని పరిశీలించారు. రాజన్న దర్శనాలు నిలిపివేయకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని స్వామీజీ సూచించినట్టు తెలుస్తున్నది.
కానీ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా దర్శనం కల్పిస్తామని పేర్కొంటూ.. ఇటీవల దేవాదాయశాఖ ప్రకటన విడుదల చేసింది. ఎల్ఈడీ స్క్రీన్‌లో మూల విరాట్‌ను ఎలా చూపిస్తారంటూ పూజారులు ప్రశ్నించడంతో అధికారులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా స్వామివారి సన్నిధిలో జరిగే చతుష్కాల పూజలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఓ అధికారి తెలిపారు. దేవాలయ అభివృద్ధి పేరిట సర్కారు, అధికారులు కొనసాగిస్తున్న సస్పెన్స్, అస్పష్టత నిర్ణయాలు, విరుద్ధమైన ప్రకటనలు, భక్తులకు ఏర్పడుతున్న ఇబ్బందుల వంటి అంశాలను ఎండగడుతూ ‘రాజన్నతోనే దాగుడు మూతలు!’ శీర్షికన ఈ నెల 13న ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనం ఆలయ వర్గాలు, పాలకుల్లో కలకలం సృష్టించింది. వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న దేవాలయ అధికారులు, మళ్లీ పాత పంథానే అనుసరిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలయ విస్తరణ పేరిట ప్రభుత్వ పెద్దలు, అధికారులు దోబుచులాట ఆడుతున్నారన్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శనాలు, గుడిమూసివేత వంటి అంశాలపై అస్పష్టమైన ప్రకటనలు వెలువడటంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. రాజన్న ఆలయంలో నిత్యం నిర్వహించే కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమ పూజ, నిత్య కల్యాణం, చండీహోమం తదితర పూజా కార్యక్రమాలను ఈ నెల 11 నుంచి భీమేశ్వరస్వామి ఆలయం వద్ద నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్టుగా అదే రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో దేవాలయ అధికారులు పేర్కొన్నారు.
అదేరోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భీమేశ్వరస్వామి ఆలయంలో స్వయంగా కోడెమొక్కలు చెల్లించి పూజలను అధికారికంగా ప్రారంభించినట్టు చెప్పారు. ఈ నెల 12 నుంచి శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్టు దేవాలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. వీటిపై విమర్శలు రావడంతో ప్రధాన ఆలయంలో నిత్య కైంకర్యాలు, చతుష్కాల పూజలు ఆలయ అర్చకులతో యథావిధిగా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని రకాల మొక్కులు ఇప్పుడు స్వామి వారి సన్నిధిలోనే జరుగుతుండగా ప్రచార రథం తెరపైకి ఎందుకొచ్చిందనేది ఎవరికీ అంతుపట్టడంలేదు.
ఈ రథంలోని ప్రతిమల వద్దే మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆలయంలోని రాజన్నను ప్రత్యక్షంగా దర్శించుకునే అవకాశం లేకుండా చేస్తారేమోనని భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అసలు ఆలయంలో ఏయే అభివృద్ధి పనులు నిర్వహిస్తారు? రూపురేఖలను ఏ మేరకు మార్చుతారు? అందుకు ప్రణాళికలు ఏంటి? ప్రణాళికలకు పీఠాధిపతుల ఆమోదం ఉన్నదా? పనులు ఎప్పుడు మొదలు పెడుతారు? ఆలయం మూసివేస్తారా? ఎప్పుడు మూసివేస్తారు? ఒకవేళ మూసివేస్తే ఎంతకాలం మూసివేస్తారు? అనే సందేహాలపై ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టతలేదు.