SLBC Tunnel | హైదరాబాద్, మార్చి2 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగం కూలిన ప్రాంతంలోనే కాకుండా అక్కడి నుంచి దాదాపు 400 మీటర్ల దూరం వరకూ సిమెం ట్ సెగ్మెంట్లు చెదిరినట్టు తెలుస్తున్నది. వాటి మధ్య నుంచి నీటిఊట నిరంతరంగా వస్తున్నదని కార్మికులు, సహాయ బృందాలు తెలిపాయి. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, ఆయా ప్రాంతాల్లో సైతం కుప్పకూలేందుకు ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయ బృందాలు లోపలికి వెళ్తున్నాయి.
శ్రీశైలం నుంచి ఇన్లెట్ సొరంగంలో 13.931 కిలోమీటరు వద్ద గట్టి రాతి పొరలు కాకుండా పర్రెలు వారిన రాతిపొరలతోపాటు, వాటి నుంచి భారీ ఎత్తున నీళ్లు రావడంతోపాటు వదులైన మట్టి ఉన్నట్టుగా గతంలోనే గుర్తించారు. ఇలాంటి షియర్ జోన్ 8 మీటర్ల మేర ఉన్నట్టుగా గుర్తించారు. ఊటనీటి పరిమాణాన్ని సరిగా అంచనా వేయకపోవడం, అధ్యయనం చేయకపోవడంతోపాటు సరైన నివారణ చర్యలు చేపట్టకుండానే దాదా పు 14 మీటర్ల మేరకు పనులు నిర్వహించా రు. ప్రమాదం జరిగిన 13.93 కి.మీ, పా యింట్ నుంచి ఎగువన దాదాపు 300 మీట ర్ల వరకు సొరంగంలోకి ఆ శిథిలాలు ముం దుకు వచ్చినట్టు తెలుస్తున్నది. దీనిపై నిపుణు లు, ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పనుల్లో భాగంగా టీబీఎం యంత్రం ముందుకు వెళ్లగానే సిమెంట్ సెగ్మెంట్లను వేశారు. అనంతరం భారీగా, అత్యంత వేగంతో ఊటనీరు రావడంతోపాటు అప్పటివరకు పూర్తిచేసిన సొరంగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అత్యంత వేగంతో నీటిఊటతోపాటు, మట్టి, రాళ్లు కూడా పైనుంచి సొరంగంలోకి దూసుకొచ్చాయి. అత్యంత బరువైన టీబీఎం ధ్వంసం కావడంతోపాటు, నీటి ఊట ధాటికి అది కూడా కొద్దిదూరం వెనక్కి వచ్చిందటే దాని తీవ్రతను తెలుసుకోవచ్చు.
సొరంగంలో ప్రమాదస్థలంతోపాటు, దా ని పరిసర ప్రాంతాల్లో సొరంగం దెబ్బతిన డం, నీటి ఊట భారీగా వస్తుండటంతో నిపుణులు, సహాయ బృందాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ బృందాలు, కార్మికులు లోపలికి అడుగుపెట్టేందుకు జం కుతున్నారు. డీవాటరింగ్ చేసినా ఫలితంలేకుండా పోతున్నదని చెప్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి జాడ కోసం రోజులుగా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అన్వేషిస్తూనే ఉన్నారు. పలుచోట్ల రాతి, మట్టితో సొరంగం మార్గం పూర్తిగా మూసుకుపోగా, పలుచోట్ల 7-8 మీటర్ల వరకు బురద, మట్టి పేరుకుపోయాయి.
సిమెంట్ సెగ్మెంట్లు సైతం పూర్తిగా ధ్వంసమై, పలుచోట్ల పర్రెలు వాసి, మరికొన్ని చోట్ల వదులుగా మారి, కదిలిపోయి ఉన్నట్టు గుర్తించారు. శిథిలాలను తీస్తే ఏది, ఎక్కడ, ఎప్పుడు కూలుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది. దీంతో సహాయ చర్యలు చేపట్టేందుకు కార్మికులు, రెస్య్యూ బృందాలు తటపటాయిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రోబోల సేవలను వినియోగించుకోవాలని ఉన్నతాధికారులకు రెస్య్యూ బృందాలు సూచించినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం సైతం అంగీకారం తెలపడంతోపాటు, స్వయంగా సీఎం రేవంత్రెడ్డి సైతం ఈ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. దీన్నిబట్టి సొరంగంలోని ప్రమాదర పరిస్థితులను అంచనా వేయవచ్చు.