Congress | కాంగ్రెస్‌కు ఓటేస్తే డేంజర్ బెల్స్.. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే జరిగే అనార్థాలివే!
Congress | రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు లేక.. సాగునీరు రాక.. భూములు పడావు పడ్డాయి. అందుకే ఒక్క రైతు జేబులో రూపాయి నిల్వ లేదు. ఆ ఊరికి ఆర్థిక భరోసా లేదు. పల్లెల్లో ఉపాధి లేక అటు రైతులు, ఇటు ఇతర వ్యాపారం చేసుకునేవారు వలసలు పోయేవారు.
Congress | హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధానప్రతినిధి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు లేక.. సాగునీరు రాక.. భూములు పడావు పడ్డాయి. అందుకే ఒక్క రైతు జేబులో రూపాయి నిల్వ లేదు. ఆ ఊరికి ఆర్థిక భరోసా లేదు. పల్లెల్లో ఉపాధి లేక అటు రైతులు, ఇటు ఇతర వ్యాపారం చేసుకునేవారు వలసలు పోయేవారు. పిల్లలు, ముసలోళ్లు తప్ప ఊర్ల ఒక్క మనిషి కనిపించకపోయేది. పడావు పడిన భూములను చూసి తొండలు గుడ్లు కూడా పెట్టని భూములంటూ ఎకరానికి రూ.లక్ష ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోయేది.
కానీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు బంధు వచ్చింది.. 24 గంటల కరెంటు వచ్చింది.. ప్రాజెక్టులతో సాగు నీళ్లు వచ్చాయి. భూగర్భజలాలు పెరిగి బోర్లు జోరుగ పోస్తున్నయ్. అందుకే రైతు ఏటా రెండు పంటలు పండిస్తున్నడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నడు. వాటిని తన కుటుంబ అవసరాలకు ఖర్చు చేస్తుండటంతో గ్రామాల్లో ఇతర వ్యాపారాలూ కళకళలాడుతున్నాయి. మొత్తంగా గ్రా మీణ గల్లాపెట్టె గలగలలాడుతున్నది. భూము ల ధరలు పెరిగి గ్రామీణ ప్రాంతాల్లోనూ రియల్ రంగంలో జోష్ కనిపిస్తున్నది.
మరి కాంగ్రెస్ వస్తే.. కరెంటు 3 గంటలే ఇస్తానంటున్నది. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టాలంటున్నది. రైతు-కౌలుదారు మధ్య రైతుబంధు చిచ్చు రాజేస్తానంటున్నది. ధరణి రద్దుతో గ్రామాల్లో భూముల పంచాయితీలు తెస్తానంటున్నది. విధ్వంసం నుంచి వికాసం అనేది తెలివైన సమాజం చేసే పని. కానీ వికా సం నుంచి విధ్వంసానికి వెళ్లాలనుకోవడం?!
మొండి గోడలతో తెలంగాణ పల్లెలు
‘ఊర్లో ఏమున్నది.. ఆకలి చావులు తప్ప. పట్నానికి పోయి కూలినాలీ చేసుకుంటే ఒక పూట తిండయినా దొరుకుతుంది’.. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో ఇదీ పరిస్థితి. పూడిక పేరుకుపోయి తాంబాలాలుగా మారిన చెరువులు.. ఒట్టిపోయిన బోర్లు, బావులు.. కరెంటు కోతలు.. విత్తనాలు, ఎరువుల వెతలు.. ఆదుకునేవాడు లేక రైతులంతా చెట్టుకొకరు.. పుట్టకొకరుగా దేశాలు పట్టుకుని తిరిగేవారు. అర ఎకరం, ఎకరం సాగు చేద్దామన్నా నకిలీ విత్తనాలు, అర్ధరాత్రి కరెంటుతో పాము కాట్లు, కరెంటు షాక్‌లతో అర్ధంతరంగా తనువు చాలించిన అన్నదాతల సంఖ్య వేలల్లోనే ఉండేది.
వ్యవసాయం సాగకపోవడంతో దాని అనుబంధంగా ఉండే కుల వృత్తుల రెక్కలు విరిగిపోయాయి. ఊర్ల ఎవరూ లేకపోవడంతో ఇతర రంగాలూ కనుమరుగయ్యేవి. పిల్లలు, ముసలోళ్లను ఇంటి దగ్గర ఉంచితే… తమ వారు ఎప్పుడు వస్తారోనని మొండి గోడల మధ్య ఏండ్లకు ఏండ్లు ఎదురుచూపులు! అందుకే నాటి తెలంగాణ పల్లెలపై గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అన్న పాట ప్రతి హృదయాన్నీ కదిలించింది. ముఖ్యంగా 2005-06 నుంచి 2014 వరకు గమనిస్తే వ్యవసాయ రంగ వృద్ధిరేటు సగటున 4 శాతానికి మించలేదు. మూడేండ్లు ఏకంగా రుణాత్మక వృద్ధి నమోదైంది. దీంతో రైతులంతా నగరాల్లో వాచ్మెన్లుగా, ఆటో డ్రైవర్లుగా, అడ్డా కూలీలుగా దర్శనమిచ్చేవారు.
రాసిందే రాత.. గీసిందే గీత
గ్రామాల్లో రైతులు ఎవరూ లేకపోవడం ఒక వంతైతే! రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటం మరోవంతు! ఇలా గ్రామాల్లో కాంగ్రెస్ నేతల ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది రాసిందే రాత, గీసిందే గీత. రాత్రికి రాత్రి రైతుల పేర్ల మీద ఉన్న భూములు రాజకీయ నాయకులు, ఆర్థికంగా ఉన్నవారి పేర్ల మీదకు మారేవి. రైతు వచ్చి అడిగినా పట్టించుకునే దిక్కుండేది కాదు. తమ భూములు అన్యాక్రాంతమయ్యాయని రైతులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా రెవెన్యూ రికార్డులు ఎప్పుడో మారిపోవడంతో వారికి న్యాయం కూడా జరిగేది కాదు. ఇలా కాంగ్రెస్ నేతలు చేసిన సెటిల్మెంట్లతోనే రైతుల తలరాతలు మారేవి. ఈ క్రమంలో రైతుల మధ్య భూముల పంచాయితీలు.. గ్రామాల్లో అశాంతి నెలకొని ఉండేది.
కూలీల కరువు.. సాగు యాంత్రీకరణ
తెలంగాణ ఏర్పడిన తర్వాత విప్లవాత్మక విజయం సాగు 24 గంటల కరెంటు. ఆపై సాగునీటి ప్రాజెక్టులు.. దీనికి తోడు మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం. రైతుబంధు, నిర్ణీత సమయంలో అందుబాటులోకి విత్తనాలు, ఎరువులు ఇలా తెలంగాణ ప్రభుత్వం రైతన్నను కంటికి రెప్పలా చూసుకోవడంతో వ్యవసాయ రంగం ఊహించని రీతిలో రికార్డులు నమోదు చేస్తున్నది. 65 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి నుంచి ఇప్పుడు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి స్థాయికి ఎదిగిందంటే రైతుల ఆర్థిక ముఖచిత్రం ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.
బలీయమైన ఆర్థిక చక్రంలో పల్లెలు
ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో వ్యవసాయం గ్రామీణ ఆర్థిక ముఖచిత్రానికి కేంద్ర బిందువుగా మారింది. గుంట భూమిని సైతం వదలకుండా రైతులు సిరులు పండిస్తుండటంతో ప ల్లెలన్నీ ధాన్యపు రాశులుగా మారాయి. రైతును కంటికి రెప్పలా చూసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం చివరకు రైతు పండించిన పంటను సైతం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటున్నది. వారం రోజుల్లోనే వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నది. తద్వారా రైతు కొనుగోలు శక్తి పెరిగింది.
కిరాణా సామగ్రి మొదలు కుటుంబ అవసరాల నిమిత్తం కొనుగోలు చేసే సామర్థ్యం పెరగడంతో గ్రామాల్లో వ్యాపార రంగం నానాటికీ వృద్ధి చెందుతున్నది. వ్యవసాయం బాగు పడటంతో దాని ఆధారంగా ఉండే కుల వృత్తులు సైతం పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇలా గ్రామాల్లోనే అనేక రంగాలు బలోపేతమై, రైతు వెచ్చించే ప్రతి పైసా ఆ గ్రామం చుట్టూ ఒక ఆర్థిక వలయాన్ని ఏర్పాటు చేసుకొని సామాజిక భద్రతను ఏర్పాటు చేసింది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన మరో విప్లవాత్మక సంస్కరణతో ఏర్పాటైన ధరణి ఇప్పుడు రైతుల భూములకు ఒక రక్షణ కవచంలా మారింది.
- ఒక రైతు జేబులో రూ.1000 ఉంటే.. పిల్లలకు మంచి బట్టలు కొంటడు. ఆ ఊర్ల ఉన్న బట్టల దుకాణం యజమానికి చేతిలోకి రూ.1000 వస్త్తాయి.
- ఒక రైతు జేబులో రూ.100 ఉంటే.. ఒక పూట ఇంటికి చికెన్ తీసుకుపోతడు. ఆ ఊర్ల ఉన్న చికెన్ దుకాణ యజమాని చేతిలోకి రూ.100 వస్తాయి.
- ఒక రైతు జేబులో రూ.10 ఉంటే.. ఊర్ల వీధి చివరన ఉండే హోటల్‌కు పోయి చాయ్ తాగుతాడు. ఆ చాయ్ బండి వ్యక్తి చేతిలోకి రూ.పది పోతాయి.
- మరి… అసలు రైతు జేబులో చిల్లిగవ్వ లేకుం టే? ఆ ఊర్ల బట్టల దుకా ణం మాయమవుతుంది. చికెన్ దుకాణం మూతబడుతుంది. చాయ్ దుకా ణం కంటికి కనిపించదు. అంటే రైతు సల్లగుంటే ఆ ఊరు సల్లగుంటది. గ్రా మ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక చక్రంలా మారి పదిమంది బతుకుతారు. వీటన్నింటికీ మించి భూముల ధరలు పెరగడంతో రైతు కుటుంబానికి ఇప్పుడు ఆర్థిక భరోసా ఉన్నది.
కాంగ్రెస్ వస్తే ఏమైతది?
- ధరణి రద్దయితది.
- 24 గంటలు పోయి 3 గంటల కరెంటు వస్తది
- అర్ధరాత్రి కరెంటుతో రైతులకు పాముకాట్లు, కరెంటు షాక్‌లకు గురి కావాల్సి వస్తది
- వ్యవసాయం చతికిలబడి భూములు పడావు
- రూ.40-50 లక్షలు ధర పలికే భూములు రూ.లక్ష లోపునకు పడిపోతాయి
- గ్రామాల్లో పట్వారీ వ్యవస్థ.. దళారుల రాజ్యం వచ్చి రైతుల భూమికి రక్షణ కరువు
- నిత్యం గ్రామాల్లో భూ పంచాయితీలతో పొలాల్లో ఉండే రైతులు ఠాణాల్లో గడపాలి
- రైతుబంధు, పంట కొనుగోళ్లు ఆగిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం.
- అన్నదాతల జేబుల్లో డబ్బులు లేక.. వ్యవసాయం సాగదు, వ్యాపారాలు నడవవు
- పల్లెల చుట్టూ ఆర్థిక చక్రం పోయి పేదరిక వలయం ఏర్పడుతుంది.
- గ్రామాలు, పట్టణాల్లో పనుల్లేక… జనం వలసలతో మళ్లీ పట్టణాల బాట పడతారు.
వికాసం వదిలి విధ్వంసం వైపు వెళదామా?
ఆరు దశాబ్దాల విధ్వంసం తెలంగాణ రైతుల అనుభవంలోనే ఉన్నది. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ హయాంలో పల్లె వికాసాన్ని కండ్లారా చూస్తున్నారు. మరి..కాంగ్రెస్ వస్తే ఇలా పల్లెల్లో అశాంతి రాజ్యమేలుతుంది.
అందుకే విధ్వంసం నుంచి వికాసంలోకి వచ్చిన మనం… తిరిగి విధ్వంసంలోకి వెళదామా? వికాసంలో పురోగమిద్దామా? అనేది ఆలోచించుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

