తుర్కయాంజాల్, జూన్ 6 : కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన భూమిపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన లేకుండానే భూమి పూజలో పాల్గొనారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం తొర్రూర్ డివిజన్ పరిధి కమ్మగూడలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొహెడ పండ్ల మార్కెట్‌కు ప్రభుత్వం కేటాయించిన సర్వేనంబర్ 167/1లో మొత్తం గుట్టలు, రాళ్లు మాత్రమే ఉన్నాయని సీఎంకు అవగాహన లేకుండానే భూమి పూజలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వం పండ్ల మార్కెట్‌కు కొహెడలోని సర్వేనంబర్ 507, 548లో సుమా రు 170 ఎకరాలను కేటాయించడంతోపాటు డీపీఆర్ సైతం సిద్ధం చేసిందని గుర్తు చేశారు. అయితే, అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు రావడం.. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి..30 నెలల పాటు ఆ పనులను జాప్యం చేయడమే కాకుండా పండ్ల మార్కెట్ ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని మార్చిందని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన వివాదాల్లేని స్థలాన్ని టీజీఐఐసీకి కేటాయించి రాళ్లు, గుట్టలతో కూడిన సుమారు 239 ఎకరాలను పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఇచ్చిందన్నారు.
కాగా, ఈ స్థలంలో 115 మంది రైతులు తమ తాతల కాలం నుం చి వ్యవవసాయం చేసుకుని జీవిస్తున్నారని..వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా అరెస్టు చేసి ఆ భూమిని లాక్కోవడం దారుణమని మండిపడ్డారు. రైతులకు పరిహారం చెల్లించిన తర్వాతే ప్రభుత్వం ఆ భూముల్లో పండ్ల మార్కెట్ పనులను చేపట్టాలని.. లేకుంటే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మాజీ కౌ న్సిలర్లు కల్యాణ్‌నాయక్, మల్లేశ్, తుర్కయాంజాల్ రైతుసేవా సహకార సంఘం మాజీ డైరెక్టర్లు సంజీవరె డ్డి, అశోక్, గౌతమ్‌రెడ్డి, చిన్నయ్య, సంపత్ పాల్గొన్నారు.