సినిమాలు, టీవీలు వచ్చాక నాటకాల ఆదరణ తగ్గింది. అలాంటి నాటకాన్ని ఇంకా భుజాన మోస్తున్నది సురభి డ్రామా థియేటర్. ఒకప్పుడు వన్స్మోర్లతో వెలిగిపోయిన సురభి.. ఇప్పుడు ఒక్కచాన్స్ ప్లీజ్ అనే స్థితికి వచ్చింది. అంతరించిపోతున్న కళకు జవజీవాలు అందించడానికి సిద్ధమయ్యాడు సురభి డ్రామా థియేటర్ నిర్వాహకుడు జయానంద్ రేకందర్. తరాలుగా అలరించిన సురభిని జెన్ జీకి చేరువ చేయడానికి సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశిస్తామని అంటున్నాడు. సురభి ప్రాభవాన్ని చాటడానికి ఓటీటీని రంగస్థలం చేసుకుంటానని చెబుతున్న జయానంద్ ప్రస్థానం ఆయన మాటల్లోనే..
నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు సిద్దిపేటలో బాలనాగమ్మ నాటకం వేస్తే ఆ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. వారం రోజులపాటు ప్రదర్శనలు ఇచ్చినా.. జనం నీరాజనం పట్టారు. ఆ స్థాయిలో ప్రేక్షకులు హాజరవ్వడం నా జీవితంలో అదే మొదటిసారి, చివరిసారి కూడా!
1885లో ‘కీచక వధ’ నాటకంతో కడప జిల్లాలోని సొరగులో ప్రారంభమైన సురభిలో నాది ఎనిమిదో తరం. నాటక ప్రదర్శనలిస్తూ సంచార జీవితం గడపడం వల్ల అన్ని ఊర్లూ మావే అయిపోయాయి. నేను పుట్టింది వరంగల్ జిల్లాలోని ఏనుగల్లు గ్రామం. జన్మించిన రెండు నెలలకే వసుదేవుడు శ్రీకృష్ణుణ్ని యశోద వద్దకు చేర్చే ఘట్టంతో నన్ను సురభిలో భాగం చేశారు. అలా చిన్ని కృష్ణుడిగా మొదలైన నా ప్రయాణం నేడు మాయాబజార్లోని పెద్ద కృష్ణుడి వరకు చేరింది. బాల్యంలో లవకుశులు, ప్రహ్లాదుడు లాంటి పాత్రలు చేశాను. సంచార జీవితంలో నా చదువు కూడా అలాగే కొనసాగింది. నేను పదోతరగతి వరకు తొమ్మిది పాఠశాలలు మారాను. కరీంనగర్, వరంగల్, మెదక్ ప్రాంతాల్లో నా పాఠశాల చదువంతా సాగింది. ఒకవైపు బడికి వెళ్తూనే నాటకాలు వేస్తుండేవాణ్ని. నాటకాలు వేస్తునే బీటెక్ చేశాను.

ఎంత పాత నాటకమైనా, ఎన్నిసార్లు పోషించిన పాత్ర అయినా.. మళ్లీ ప్రదర్శనకు ముందు తప్పకుండా రిహార్సల్ చేసేవాళ్లం. ప్రేక్షకుల ముందు మాట రాకుండా డైలాగులు, పద్యాలు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయించేవారు. మేం కష్టపడి నాటకాలు వేశామన్న మాటే కానీ, ఇష్టంతో మాత్రం వేయలేదు. ఆదరణ లేని నాటకాలు ఎవరు చూస్తారనేది మనసును తొలిచివేసేది. చాలాసార్లు నిరాశకు గురయ్యేవాణ్ని. ఎంతో కష్టపడి ప్రదర్శనకు వెళ్తే.. అక్కడ పది, పదిహేను మంది మాత్రమే ప్రేక్షకులు కనిపించేవాళ్లు. ఒక దశలో బీటెక్ చదివి ఈ నాటకాలేంటని కూడా ఆలోచించాను. ఉద్యోగం చేసుకుంటానని నాన్నతో చెప్పాను. అలా పుష్కర కాలం ఉద్యోగం చేస్తూనే.. అడపాదడపా నాటకాల్లో పాలుపంచుకున్నాను. కరోనా సమయంలో లాక్డౌన్ మా కళాకారుల జీవితాలను కాటేసింది. తిండిగింజల కోసం తెలిసిన దాతలను సంప్రదించి సురభి కళాకారుల కుటుంబాలకు పంపిణీ చేశాను. నాటకాలు వేసే అవకాశం కల్పించమని వేడుకున్నాను.
ఇతరుల నుంచి ఉచితంగా నిత్యావసరాలు తీసుకోవడం ఇబ్బందిగా అనిపించేది. అలా తినడం ఇష్టంలేక ఆన్లైన్లో నాటకాలు వేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే విజయవాడలో కేఎల్ యూనివర్సిటీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవకాశం కోసం వాళ్లను సంప్రదించాను. నాలుగు గంటల నిడివి ఉన్న మాయాబజార్ నాటకాన్ని అరగంటలో వేయాలని వారు షరతు పెట్టారు. సరే అని ఒప్పుకొని జూమ్‌లో ప్రారంభించాం. ప్రదర్శన ప్రారంభించిన వెంటనే ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో నలభై నిమిషాల పాటు పొడగించాం.
ఆ తరువాత ఆన్లైన్ వేదికగా సురభి నాటకాలు ప్రారంభించాలని విదేశాల్లోని తెలుగువారిని సంప్రదించాను. అమెరికా, సింగపూర్, మలేషియాలో ఉంటున్న మన తెలుగు వాళ్లకు నా ప్రపోజల్ చెప్పాను. కొందరైతే ‘సురభి కళాకారులు ఇంకా ఉన్నారా?’ అని ఆశ్చర్యపడ్డారు. విదేశాల్లో ఉంటున్నవారు అవశాలు కల్పించడంతో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఎక్కాం. అక్కడి వారి సమయానికి అనుగుణంగానే మా ప్రదర్శనలిచ్చాం. జూమ్, యూట్యూబ్ వేదికల్లో 58 నాటకాలు ప్రదర్శించాం. లాక్డౌన్లో ఆన్లైన్లో ప్రదర్శనలే లేకపోయి ఉంటే.. సురభి ప్రస్థానమే ముగిసిపోయేదేమో అనిపిస్తుంటుంది!
లాక్డౌన్ తరువాత ఆన్లైన్ నాటకాలకు స్వస్తి పలికి జనాలు ఉన్నచోటికే వెళ్లి నాటకాలు వేయడం ప్రారంభించాం. ఓటీటీ వేదికగా సురభి నాటకాలను ప్రదర్శించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాటకాల్లోని పద్యాల నిడివి తగ్గించి జెన్‌జీకి అర్థమయ్యేలా మార్పు చేస్తున్నాను. పౌరాణిక నాటకాలకు కేరాఫ్ అడ్రస్ సురభి గురించి సోషల్ మీడియాలో చాలామంది వెతుకుతున్నారు. కానీ, ఇప్పటి వరకు మా నాటకాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయలేదు. దానివల్ల చాలా నష్టపోయాం. ఇకపై సామాజిక మాధ్యమాల్లోనూ సురభి ప్రాభవం కొనసాగేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. తరానికి తగ్గట్టుగా మేమూ మారాలి కదా! నాలాగా నా పిల్లలు సంచార జీవితం గడపకుండా ఒకేచోట చదువుకుంటున్నారు. నాటకాలకూ సమయం ఇస్తున్నారు. వాళ్లు ఎదిగేసరికి సరికొత్త సురభి సృష్టించాలన్నదే నా లక్ష్యం.
– రాజు పిల్లనగోయిన