బన్సీలాల్‌పేట, జూన్ 6: తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు మహిళలకు గాంధీ దవాఖాన వైద్యులు సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలంలోని చిత్యాల గ్రామానికి చెందిన ఎస్ లావణ్య (27) గత రెండేండ్లుగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అడ్రినల్ గ్రంథిలో ఏర్పడే అరుదైన కణితి వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని, ఆ కణితి అధిక పరిమాణంలో హార్మోన్లను విడుదల చేసి హఠాత్తుగా రక్తపోటును పెంచుతుందని గాంధీ దవాఖాన వైద్యులు గుర్తించారు.
పది లక్షల మందిలో ఇద్దరికి మాత్రమే వచ్చే ఈ సమస్యను సవాలుగా తీసుకుని లావణ్యకు లాప్రోస్కోపిక్ (కీహోల్) శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీ విజయవంతమవడంతో ఆమె పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు. ఈ శస్త్రచికిత్సలో యూరాలజీ హెచ్‌వోడీ డాక్టర్ రవిచందర్, ఎండోక్రైనాలజీ హెచ్‌వోడీ డాక్టర్ విజయ్ శేఖర్, అనస్థీషియా హెచ్‌వోడీ డాక్టర్ మురళీధర్, రేడియాలజీ హెచ్‌వోడి డాక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.
రెండేండ్ల నుంచి మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఓ యువతి (22)కి గాంధీ దవాఖాన వైద్యులు సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌కు చెందిన ఆ యువతి 2 నెలల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆ యువతికి కిడ్నీ దానం చేసేందుకు ఆమె తల్లి (46) ముందుకొచ్చారు. దీంతో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ యువతికి పరీక్షలు నిర్వహించిన గాంధీ దవాఖాన వైద్యులు.. గత నెల 27న ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.
ఈ శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆ యువతి, ఆమె తల్లి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరిందని గాంధీ దవాఖాన నెఫ్రాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ ఎడ్ల మంజూష వెల్లడించారు. ఇకపై ఆ యువతికి డయాలసిస్ అవసరం లేదని తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యులను గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కే సునీల్ కుమార్ అభినందించారు.