కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకానికి వేళయింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 15 మందికి మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఇందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధంచేసింది. ఈ సందర్భంగా నిర్వహించే సభకు దాదాపు లక్షా 20 వేల మంది దళితులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలిరానున్నారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ పాసులు, కొవిడ్ నిబంధనల మేరకు మాస్కులు అందించనున్నారు. శాలపల్లి-ఇందిరానగర్‌కు వెళ్లే దారి ఇప్పటికే స్వాగత తోరణాలు, బీఆర్ అంబేద్కర్, సీఎం కేసీఆర్ భారీ కటౌట్లతో గులాబీమయంగా మారింది. మరోవైపు, సీఎం సభాస్థలిని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ ఆదివారం పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణంలో కలియ తిరిగారు. వారి వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.