మహబూబాబాద్ : రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో జనగామ జిల్లా కొడకండ్ల, తొర్రూరు మండల దళిత, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. దళితబంధు కార్యక్రమం అమలుపై సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు లాభకరమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారుల ఎంపిక తదుపరి వారికి శిక్షణ, పెట్టబోయే పథకంపై లబ్ధిదారునికి సరైన అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఎంపిక చేసిన లబ్ధిదారుల ఈ పథకాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఇలాంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. కార్యక్రమంలో తొర్రూరు మండల స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, దళితులు, ప్రజలు పాల్గొన్నారు.