Toxic | కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. బెంగళూరులోని పీణ్య–జలహళ్లి సమీప అటవీ ప్రాంతంలో సినిమా షూటింగ్ సందర్భంగా అనుమతి లేకుండా వేలాది చెట్లను నరికివేశారనే ఆరోపణలు నిజమని కర్ణాటక అటవీ శాఖ తేల్చడంతో నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. షూటింగ్ యూనిట్‌తో పాటు భూమిని లీజుకు ఇచ్చిన వ్యక్తులపైనా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ పరిణామం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మలయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో డార్క్, ఇంటెన్స్ టోన్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజువల్స్, కథన శైలిలో కొత్త అనుభూతి అందించేందుకు వరల్డ్ క్లాస్ టెక్నిషియన్లతో పని చేస్తున్నట్లు యూనిట్ ముందుగానే వెల్లడించింది. టీజర్ ద్వారా యష్ డిఫరెంట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హుమా ఖురేషి, నటాలీ బర్న్ వంటి నటీమణులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, క్యారెక్టర్ విజువల్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. యష్ స్టైలిష్ లుక్కు మాస్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.
అయితే తాజాగా అటవీ భూమిలో అక్రమంగా చెట్లు నరికివేశారనే ఆరోపణలు తీవ్రంగా మారాయి. షూటింగ్‌కు అనుమతి ఉన్నప్పటికీ, అనుమతి పరిమితులను దాటి అడవిలో చెట్లు నరికివేయడం చట్టవిరుద్ధమని అటవీ శాఖ స్పష్టం చేసింది. అటవీ శాఖ మంత్రి స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అనంతరం అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇది ఒక్కటే కాకుండా, టీజర్ విడుదల సమయంలోనూ ‘టాక్సిక్’పై వివాదాలు చెలరేగాయి. టీజర్‌లోని బోల్డ్ సన్నివేశాలు, హింసాత్మక అంశాలపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, మహిళా కమిషన్ వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. ఒకవైపు టీజర్‌కు భారీ వ్యూస్, మాస్ రెస్పాన్స్ వస్తుండగా.. మరోవైపు వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజా లీగల్ ఇష్యూ సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందా? లేదా మేకర్స్ అన్ని అడ్డంకులను దాటుకుని చిత్రాన్ని సమయానికి రిలీజ్ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం ‘టాక్సిక్’ విడుదల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.