దళితబంధు పథకం అట్టడుగున ఉన్న ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దుర్భరమైన బతుకుల్లో మార్పులు తెస్తూ దళితజాతి ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా అడుగులు వేయిస్తున్నది. పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకం కింద లబ్ధిపొందిన ఏ దళిత కుటుంబాన్ని చూసినా దశాబ్దాలుగా ఆర్థికంగా చితికి పోయిన వారి ఇండ్లలో ఆర్థిక పవనాలు వీస్తున్నాయి.
దళితులను ఆర్థికంగా స్థితిమంతులను చేయాలనే సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. దళితబంధు యూనిట్ పొందిన ప్రతి కుటుంబం ఇప్పుడు నెలకు సగటున రూ.30 వేల దాకా ఆర్జిస్తున్నది. గతంలో వారికి ఉన్న అప్పులు తీరుతున్నాయి. పిల్లలకు మంచి విద్య, అందుతున్నది. సొంత ఇండ్లు నిర్మించుకోవడం, వాహనాలు కొనుగోలు చేసుకోవడం వంటి విషయాలపై లబ్ధిదారులు దృష్టి సారిస్తున్నారు.
ఇక్కడ మెడికల్ షాపులో కనిపిస్తున్న యువకుడి పేరు మాట్ల శ్రీకాంత్. హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఇతను 12 ఏండ్లపాటు ఓ మెడికల్ షాపులో పనిచేశాడు. నెలకు రూ.12 వేల జీతంతో ఇద్దరు పిల్లలు, భార్య, ఇతర కుటుంబసభ్యులను పోషించుకోవడం కష్టంగా ఉండేది.
కుటుంబం గడవక అప్పటికే రూ.2లక్షలకుపైగా అప్పులు చేయాల్సి వచ్చింది. ఇక తన బతుకు ఇంతే అనుకొంటున్న సమయంలో వచ్చిన దళితబంధు పథకంతో ఇతని జీవితమే మారిపోయింది. నెలకు రూ.10 వేలకు ఒక వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న తన బంధువు ముక్క రమేశ్‌తో కలిసి మెడికల్ షాపు పెట్టుకొన్నాడు. ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన ఆ షాపు ఏడాదిలోనే ఎంతో క్లిక్ అయింది. వీళ్లు ఇద్దరూ మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. ఏడాదిలోనే తమ జీవితాల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నదని చెప్తున్న శ్రీకాంత్.. ఇప్పుడు ఎంతో ఆత్మైస్థెర్యంతో కనిపిస్తున్నాడు. ఏడాది కిందటి వరకు ఉన్నంతలో తిని తినకున్నా బతుకులు ఈడ్చామని, ఇప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కొని తింటున్నామని సంతోషంగా చెప్తున్నాడు. తన కొడుకును మంచి పాఠశాలలో చేర్పించగలిగానని, ఖర్చులు పోను నెలకు రూ.50 వేల దాకా మిగులుతున్నాయని తెలిపాడు. తాను చేసిన రూ.1.50 లక్షల అప్పు, బంధువు రమేశ్ చేసిన రూ.2 లక్షల అప్పు తీర్చుకొన్నామని శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేశాడు.
కరీంనగర్, నమస్తే తెలంగాణ : దళితబంధు పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హుజూరాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని.. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్‌లో ప్రారంభించారు. పథకాన్ని ప్రారంభించిన 11 నెలల్లోనే అధికారులు యూనిట్లను లబ్ధిదారులందరికీ అందజేశారు. 18,021 కుటుంబాలకు రూ.1,784,79 కోట్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారు. దళితబంధులో ఆర్థికసాయం పొందిన కుటుంబాలు ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి? వారి ఆర్థిక స్థితిగతులు ఏమైనా మెరుగుపడ్డాయా? అనే కోణంలో ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినప్పుడు ప్రతి కుటుంబం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ బడుగుల కుటుంబాలన్నీ సీఎం కేసీఆర్‌ను దేవుడిగా కొలుస్తున్నాయి. లబ్ధిదారులు తమ ఇండ్లపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసిన దృశ్యాలు కనిపించాయి.
ఏడాదిలో రూ.3 లక్షల అప్పు తీర్చాడు..
ఇతని పేరు మిడిదొడ్డి సారయ్య. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లివాసి. చిన్న తనం నుంచి పాలేరుగా బతికి, కాస్త పెద్దయ్యాక కౌలు రైతుగా మారాడు. యవ్వనమంతా అలాగే గడిచిపోయింది. మోకాళ్ల నొప్పులు, ఆరోగ్య సమస్యలు రావడంతో బతుకుదెరువు ఎలా అని బాధపడుతున్న క్రమంలో దళితబంధు ఆయనకు వెలుగు రేఖలా నిలిచింది.
సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకంలో మినీ డెయిరీని ఎంచుకొన్నాడు. తనకు మొదటి విడతలో మంజూరైన రూ.5 లక్షల్లో రూ.1.50 లక్షలతో షెడ్డు నిర్మించుకొన్నాడు. మిగతా రూ.3.50 లక్షలతో గుజరాత్ నుంచి 4 పాడి బర్రెలను కొని తెచ్చుకొని గతేడాది ఉగాది రోజున యూనిట్‌ను స్థాపించాడు. పూటకు 16 నుంచి 20 లీటర్ల పాలను హుజూరాబాద్ వెళ్లి అమ్మడం ప్రారంభించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తన కష్టానికి ఫలితం కనిపించసాగింది. దీంతో బతుకుదెరువుపై ఉన్న దిగులంతా క్రమంగా మాయమైపోయింది. నెలకు ఖర్చులు పోను రూ.40 వేల దాకా మిగులుతున్నాయి. ఈ ఏడాది కాలంలో తన పెద్ద కూతురు మౌనిక పెండ్లికి చేసిన రూ.3 లక్షల అప్పు తీర్చుకొన్నాడు. ఇప్పుడు చిన్న కూతురు మానస కూడా పెండ్లికి ఎదిగింది. అప్పు చేయకుండా చిన్న కూతురుకు పెండ్లి చేస్తానని ధీమాగా చెప్తున్నాడు. ఇలా ఒక్క సారయ్యలోనే కాదు. నియోజకవర్గంలోని ఎందరో నిరుపేదలైన దళితులకు ఈ పథకం ఆత్మైస్థెర్యాన్ని కల్పించింది.
నాని.. టిఫిన్ సెంటర్ ఓనర్
మొన్నటి వరకు బజ్జీల బండి ఓనర్ దగ్గర రోజుకు రూ.300కు పని చేసిన రాచపల్లి నాని.. దళితబంధు ఇచ్చిన ఆర్థిక సాయంతో ఇప్పుడు అలాంటి బండి కాదు.. మొబైల్ టిఫిన్ సెంటర్‌కు ఓనరై పోయాడు.
జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లికి చెందిన నాని ఏడాది కిందటి వరకు ఇదే పట్టణంలోని కుమార్ బాటియా అనే బజ్జీల వ్యాపారి వద్ద రోజుకు రూ.300 కూలీకి పనిచేసేవాడు. పదేండ్లు పనిచేసిన నాని తన బతుకు ఇక ఇంతే అనుకొంటున్న సమయంలోనే దళితబంధు ఆయన జీవితంలో ఆశా కిరణంలా వెలిగింది. ఈ పథకం కింద వచ్చిన ఆర్థిక సాయంతో ఒక ట్రాలీ ఆటో తీసుకొని, దానిని మొబైల్ టిఫిన్ సెంటర్‌గా మార్చేశాడు. ఉదయం పట్టణంలోని రామా దవాఖాన వద్ద, సాయంత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజూ ఖర్చులు పోను రూ.1,500 దాకా మిగులుతున్నాయని చెప్తున్న నాని, ఇప్పటికే రూ.2 లక్షల అప్పు తీర్చేశాడు. ఒకప్పుడు బజ్జీల బండిపై కూలీగా ఉన్న నాని.. ఇప్పుడు టిఫిన్ సెంటర్‌కు ఓనర్‌ను చేసిన ఘనత దళితబంధు పథకానికే దక్కింది.
వ్యవసాయ కూలీ పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకొంటున్న తాళ్లపల్లి నరేశ్ దళితబంధుతో నాటు వేసే యంత్రానికి ఓనరయ్యాడు. వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన నరేశ్ కొత్తపల్లిలోని ఓ ఆసామి వద్ద వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు.
ఇతని ముగ్గురు పిల్లలను పోషించుకొనేందుకు భార్యాభర్తలు కూలీ పనులు చేసుకొనేవాళ్లు. ఇద్దరూ కలిసి నెలకు రూ.10 వేలు సంపాదించడమే కష్టంగా ఉండేది. ఇలాంటి కుటుంబానికి దళితబంధు కింద 8 నెలల కిందట వరి నాటు యంత్రం వచ్చింది. యంత్రం వచ్చిన మొదటి సీజన్ వానకాలంలో వంద, యాసంగిలో మరో 200 ఎకరాల్లో నాట్లు వేశారు. రెండు సీజన్లలో కలిపి ఖర్చులు పోను రూ.3.80 లక్షల దాకా సంపాదించుకొన్నట్టు నరేశ్ చెప్పడం చూస్తే దళితబంధు పథకం ఈ బడుగుల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
హుజూరాబాద్ మండలం చెల్పూర్‌కు చెందిన వేల్పుల శారద హుజూరాబాద్‌లోని గ్యాస్ గోదాం ఏరియాలో స్థిరపడి టైలర్‌గా పనిచేస్తున్నారు. ఎంత కష్టపడినా ఈమెకు నెలకు రూ.3 నుంచి రూ.4 వేలకు మించి ఆదాయం వచ్చేది కాదు. భర్త ప్రభాకర్ కష్టపడి కూతురు శ్రావణి పెండ్లి చేశారు.
దళితబంధు పథకం శారద జీవితాన్నే కాదు, ఆమె కూతురు జీవితాన్ని కూడా మార్చేసింది. ఇద్దరూ కలిసి నాన్ ఓపెన్ బ్యాగ్స్ తయారీ యూనిట్‌ను స్థాపించుకొన్నారు. దళితబంధులో వచ్చిన ఆర్థిక సాయానికి తామింత జోడించుకొని నిరుడు ఆగస్టులో యూనిట్ స్థాపించుకొన్నారు. సివిల్ ఇంజినీర్ పూర్తి చేసిన శారద కొడుకు నిఖిల్, అల్లుడు కొంకటి రామస్వామి వీళ్లకు తోడుగా నిలిచి ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లోని టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, మటన్, చికెన్ సెంటర్లు, బట్టల దుకాణాలు, మెడికల్ దుకాణాలు, ఇలా ప్రతి వస్తువు పార్సిల్ కోసం వ్యాపారులు ఇక్కడి నుంచే బ్యాగులు కొనుగోలు చేసుకొంటున్నారు. కరీంనగర్, వరంగల్ నగరాల్లోని వ్యాపారులకు కూడా ఈ బ్యాగులు విక్రయించే ప్లాన్‌లో ఉన్నారు. అనతి కాలంలోనే విస్తరించిన ఓపెన్ బ్యాగుల తయారీ పరిశ్రమతో ఇప్పటికే ఖర్చులు పోను నెలకు రూ.40 వేల దాకా మిగులుతున్నదని శారద చెప్తున్నారు.
అమెరికన్ టూరిస్టర్ షోరూం ఓనర్లు
హుజూరాబాద్ మండలం చెల్పూర్‌కు చెందిన శనిగరపు కల్యాణ్, రాజ్‌కుమార్ అన్నదమ్ములు. ఉన్న ఊళ్లో ఉపాధి లేక హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అక్కడి అమెరికన్ టూరిస్టర్ లగేజీ షోరూంలో పదేండ్లపాటు పనిచేశారు. కరోనాతో షోరూం నిర్వాహకులు జీతాలు తగ్గించడంతో అక్కడ బతకలేక తిరిగి సొంతూరు వచ్చారు.
తామెలా బతకాలని ఆలోచిస్తున్న తరణంలోనే దళితబంధు వీళ్ల జీవితాలను మలుపు తిప్పింది. ఈ పథకం కింద అమెరికన్ టూరిస్టర్ లగేజీ వ్యాపారమే చేయాలని నిర్ణయించుకొన్నారు. తమ బంధువు శనిగరపు సమ్మక్క, చంద్రయ్య దంపతులను కలుపుకొని వ్యాపారం ప్రారంభించాలనుకొన్నారు. వీరి భార్యలైన సరిత, మమత, సమ్మక్క పేరిట ఒక ఫర్మును కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా లాభం వస్తున్నదని చెప్తున్న కల్యాణ్ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు.
వలస వెళ్లిన అశోక్ ఇంటికి..
దళితబంధు ఎంత గొప్పదో గాజుల అశోక్‌కుమార్ జీవితం స్పష్టం చేస్తున్నది. వీణవంక మండలం బ్రాహ్మణపల్లికి చెందిన అశోక్‌కుమార్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడి మారుతి షోరూంలో నెలకు రూ.15 వేలకు ఉద్యోగం చేసేవాడు. ఇతని భార్య అక్కడే ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేసేది. ఇద్దరు పనిచేసినా హైదరాబాద్‌లో దినదిన గండంగానే బతికే వాళ్లు.
నాలుగు నెలల కింద దళితబంధు పథకానికి ఎంపికవడంతో అశోక్ జీవితం మారిపోయింది. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి తన చెల్లి మహంకాళి శోభనతో కలిసి వీణవంకలో ఒక సూపర్ బజార్ ఏర్పాటు చేసుకొన్నాడు. ప్రతి వస్తువు హోల్‌సేల్ ధరకు విక్రయిస్తూ అనతి కాలంలోనే వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్న అశోక్‌కుమార్.. నెలకు రూ.3 లక్షలకుపైగా సరుకులు అమ్ముతున్నాడు. ఖర్చులు పోను నెలకు రూ.30 నుంచి రూ.40 వేల దాకా మిగులుతున్నదని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడే స్థిరపడే ప్రయత్నం చేస్తున్నాడు. వలస వెళ్లిన ఇలాంటి ఎందరో యువకులకు దళితబంధు ఊరిలోనే ఉపాధి చూపి ఇంటి దారి పట్టించింది.
దంత వైద్యుడికి కొండంత అండ..
దంత వైద్యుడు ఎర్ర రాజేందర్‌కు దళితబంధు కొండంత అండగా నిలిచింది. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్‌కు చెందిన రాజేందర్ జమ్మికుంట గాంధీ చౌరస్తాలో 2009 నుంచి దంత వైద్యశాల నడుపుతున్నాడు. తన తండ్రి పోచయ్య ట్రాక్టర్ డ్రైవర్ కావడం వల్ల రాజేందర్ కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండేది.
ఆంధ్రా బ్యాంకు రుణంతో బీడీఎస్ పూర్తి చేసిన రాజేందర్.. లోన్ తీర్చేందుకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పలు దంత వైద్యశాలల్లో పని చేశాడు. రుణం తీరిన తర్వాత జమ్మికుంటలో దంత వైద్యశాలను ఏర్పాటు చేసుకొన్నా డు. ఆర్థిక స్థోమత లేక వైద్యశాలలో సదుపాయాలు, ఎక్యూప్మెంట్స్ ఉండేవి కావు. ఎక్స్‌రే కూడా లేక పేషెంట్లను ల్యాబ్‌కు పంపే వాడు. వైద్యం బాగున్నా సదుపాయాలు లేనందున పేషెంట్లు ఇక్కడికి వచ్చేందుకు ఆలోచించేవాళ్లు. రాజేందర్‌కు గతేడాది అక్టోబర్‌లో దళితబంధు కింద మొదటి విడతలో రూ.5 లక్షలు వచ్చాయి. వీటితో దవాఖానను రెన్నోవేషన్ చేయించుకోవడంతోపాటు ఎక్స్‌రే యూనిట్, డెంటల్ చైర్ కొన్నాడు. ఇప్పుడు ఇతని వద్ద వైద్యానికి పేషెంట్లు క్యూ కడుతున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఈ సాయాన్ని ఎన్నటికీ మర్చిపోనని చెప్తున్న రాజేందర్, రెండో విడతలో వచ్చే మరో రూ.4.90 లక్షలతో తన వైద్యశాలను మరింత అభివృద్ధి చేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
మరదలితో కలిసి హార్వెస్టర్ కొనేసింది
వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన అంబాల సునీత సాధారణ వ్యవసాయ కూలీ. భర్త రాజయ్య సుతారి మేస్త్రీ. ట్రాక్టర్ డ్రైవర్ కూడా. ఇద్దరూ కష్టపడితేనే ఇల్లు గడిచేది. ఎంత కష్టం చేసినా అప్పులు చేయనిదే కుటుంబం గడవని పరిస్థితి.
ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో సునీతకు దళితబంధు కింద రూ.9.90 లక్షలు వచ్చాయి. ఈమె తమ్ముడి భార్య కల్లెపెల్లి పూజ పేరిట మరో రూ.9.90 లక్షలు వచ్చాయి. ఇద్దరూ కలిసి హార్వెస్టర్ కొన్నారు. గత యాసంగి సీజన్లో నెల రోజుల్లోనే అన్ని ఖర్చులు పోను రూ.2 లక్షల దాకా సంపాదించారు. ఇప్పుడు ఎక్కడ పని ఉంటే అక్కడికి హార్వెస్టర్‌ను తరలించాలని నిర్ణయించుకొన్నారు. ఇలా మామూలు కూలీలను లక్షల విలువ చేసే యంత్రాలకు దళితబంధు ఓనర్లను చేసింది. ఈ యంత్రాల ద్వారా మరో ఇద్దరికి ఉపాధి కూడా లభిస్తున్నది.
కూలీ నుంచి వ్యాపారులుగా..
ఇక్కడ కనిపిస్తున్నవారు బొబ్బిలి ప్రేమయ్య, మల్లేశ్వరి దంపతులు. వీళ్లది వీణవంక మండలం గన్ముక్కుల. ప్రేమయ్యతోపాటు ఇతని కొడుకు సురేశ్ పేరిట దళితబంధు కింద రెండు యూనిట్లు కలిపి వీణవంకలో గతేడాది జూలైలో ఎలక్ట్రికల్ దుకాణం పెట్టుకొన్నారు.
ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకొంటూ, పనిలేనప్పుడు కూలీ పనులకు వెళ్లే వీళ్ల జీవితంలో గతమంతా ఆర్థిక కష్టాలే. భార్య మల్లేశ్వరి కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేది. ఏడు నెలల కింద దళితబంధు కింద ఒక్కో యూనిట్‌కు రూ.5 లక్షల చొప్పున రెండు యూనిట్లకు రూ.10 లక్షలు వచ్చాయి. ఎలక్ట్రికల్ దుకాణం పెట్టుకొని భార్యాభర్తలు ఇదే దుకాణంలో పనిచేసుకొంటున్నారు. గతంలో వ్యవసాయ కూలీలుగా ఉన్న వీళ్లు ఇప్పుడు ఎలక్ట్రికల్ దుకాణంలో వ్యాపారం చేసుకొనే స్థాయికి ఎదగడానికి దళితబంధు దోహదపడింది.
ఇప్పుడే ఇలా.. భవిష్యత్తు భళా..
పేపర్ ప్లేట్స్ మేకింగ్‌లో ఇక్కడ బిజీగా కనిపిస్తున్న ఈ కుటుంబం ఎప్పుడో దశాబ్దాల కింద శంకరపట్నం మండలం గద్దపాక నుంచి పొట్ట చేతపట్టుకొని హుజూరాబాద్‌కు వలస వచ్చింది. కుటుంబ పెద్ద కనికుంట్ల శంకర్ ఇక్కడి సివిల్ సప్లయ్స్ గోదాముల్లో హమాలీ పనిచేస్తుంటే, భార్య కళ బట్టల దుకాణంలో పని చేస్తూ ముగ్గురు పిల్లలను పోషించుకొనే
వాళ్లు.
కిరాయి ఇంట్లో ఉంటూ ఏ పూటకు ఆ పూట గడిపే ఈ కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఇంటి కిరాయి కట్టలేక యజమానులు సామాన్లు బయట పడేసిన సందర్భాలను ఈ కుటుంబం చవి చూసింది. తమ ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు భార్యాభర్తలు రెక్కలు ముక్కలు చేసుకొనేవాళ్లు. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి దళితబంధు ఇప్పుడు పెద్ద దిక్కుగా మారింది. ఈ పథకం కింద పేపర్ ప్లేట్స్ మేకింగ్ యూనిట్‌ను స్థాపించుకొన్నారు. మొదటి విడతలో వచ్చిన రూ.5 లక్షలతో 3 రకాల మిషన్లు తెప్పించుకొన్నారు. ఇప్పుడు ఈ భార్యాభర్తలే కాకుండా చిన్న కొడుకు రుత్విక్ అంతా తానై దీనిని నడిపిస్తున్నాడు. హుజూరాబాద్ పట్టణంలో, చుట్టు పక్కల గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వీళ్లకే ఆర్డర్ వస్తున్నది. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం పక్షాన నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు కూడా వీరికే ఆర్డర్లు వస్తున్నాయి. ఏడాదిలో గతంలో చేసిన రూ.2.5 లక్షల అప్పులు తీర్చుకొన్న ఈ కుటుంబం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకొంటున్నది. ఎంటర్ ప్రైజెస్‌గా ఉన్న సంస్థను ఇండస్ట్రీగా మార్చి, పది మందికి ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమని శంకర్, కళ కొడుకు రుత్విక్ ఎంతో ధీమాగా చెప్తున్నాడు.
2,327 పాడి యూనిట్లు
409 తయారీ రంగం
2,624 రిటైల్ రంగం
3,810 సేవలు/ సరఫరా రంగం
8,850 రవాణా రంగం
మండలాల వారీగా యూనిట్లు..
2,116 ఇల్లంతకుంట
2,720 హుజూరాబాద్ రూరల్
1,623 హుజూరాబాద్ అర్బన్
2,358 జమ్మికుంట రూరల్
2,264 జమ్మికుంట అర్బన్
3,009 వీణవంక
3,931 కమలాపూర్