చేగుంట, సెప్టెంబర్12: పంచాయతీ కార్యదర్శి తనపై కేసు పెట్టించారని మనస్తాపానికి గురైన ఓ దళిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లిలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండి లక్ష్మి (42)తో ఈ నెల 4న పంచాయతీ కార్యదర్శికి ఎస్సీ కాలనీలో గొడవ జరిగింది. ఈ ఘటనపై స్థానికులు లక్ష్మితో కాళ్లు పట్టించారు. అయినా కనకరించని కార్యదర్శి చేగుంట పోలీస్ స్టేషన్లో తన విధులకు ఆటంకం కలిగించిందని లక్ష్మిపై కేసుపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మి శుక్రవారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మి ఆత్మహత్యకు కార్యదర్శే కారణమంటూ దళిత సంఘాలు ఆరోపించాయి. కార్యదర్శిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబసభ్యులు పంచాయతీ కార్యదర్శిపై చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.