దళితవాడలు బంగారు వాడలవ్వాలి.. దళితజాతి రత్నాలను, దళితశక్తిని వెలికితీస్తాం.. దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మారుస్తాం.. వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకే దళితబంధు పథకాన్ని ప్రవేశపెడుతున్నాం.. ఇవీ దళితబంధు పథకం ప్రారంభం నాడు సీఎం కేసీఆర్ అన్న మాటలు.. సరిగ్గా ఇవి నిజమవుతున్నాయి. దానికి వడ్లకొండ కిష్టయ్య జీవితంలో వచ్చిన మార్పే నిదర్శనం.
మంచిర్యాల, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ కిష్టయ్య గతంలో లారీ డ్రైవరుగా పనిచేసేవాడు. మణిఘాట్, దేవపూర్ నుంచి కైకలూరు, గిద్దలూరులోని ఫిష్ పాండ్లకు లారీలలో సిమెంట్ సరఫరా చేసేది. అక్కడున్న చెరువులను పరిశీలనగా చూసిన కిష్టయ్యకు తాను కూడా చేపలు పెంచాలనే ఆలోచన మొగ్గ తొడిగింది. ఇది 15 ఏళ్లనాటి కల.
కానీ ఆర్థికస్థోమత లేక ఆయన కల కలగానే మిగిలింది. ఇదే సమయంలో తాను చేపల చెరువులు తవ్వి.. లీజుకు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఓ రైతుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆయన వద్ద కొంత నగదు తీసుకొని ఉపాధి హామీ, వాటర్ షెడ్ పథకం కింద వచ్చిన నిధులతో తనకున్న నాలుగెకరాల్లో రెండు చేపల చెరువులు తవ్వించాడు. ఆపై రైతుకు నాలుగేండ్లకు రెండు చెరువులను అద్దెకు ఇచ్చాడు.
చేపల పెంపకంపై కిష్టయ్యకు తగ్గని మక్కువ
చేపల చెరువులను అద్దెకిచ్చినా తన కలను ఎప్పుడు నెరవేర్చుకోవాలోనంటూ కిష్టయ్య నిత్యం ఆలోచనల్లో మునిగేవాడు. రోజూ చెరువుల వద్దకు వెళ్లి.. చేపల పెంపకం కోసం వారు చేసే పనులను పరిశీలించేవాడు. ఈ క్రమంలో బోటు నడపడం, చేపలకు దాణా వేయడం వంటివి అలవాటుగా మార్చుకున్నాడు.
అందివచ్చిన దళితబంధు
తన చెరువుల నాలుగేళ్ల లీజు పూర్తికావడంతో కిష్టయ్య తన కలను నిజం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక మనమే చేపలు పెంచుదామని ఆయన తన భార్య లక్ష్మితో చెప్పాడు. రూ.2 లక్షలు అప్పు తెచ్చి ఒక పాత ట్రాలీ ఆటో, రెండు బోట్లు కొనాలనుకున్నారు. సరిగ్గా అప్పుడే దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది.
24 వేల పిల్లల పెంపకం
చెరువుల్లో ఉన్న నీటిని బట్టి ఎకరాకు 6 వేల పిల్లల చొప్పున నాలుగు ఎకరాలకు 24 వేల చేప పిల్లలను వేశారు. మూడున్నర నుంచి నాలుగు ఇంచుల పొడవున్న చేపలను జగిత్యాల జిల్లా జలపుష్ప శ్రీరాములు నుంచి తీసుకొచ్చి పెంచసాగాడు. బొచ్చ, రవ్వ రకాలు వేశారు. ఒక్కో చేపకు రూ.4 చొప్పున మొత్తంగా రూ.96 వేల ఖర్చయింది. వేసిన పిల్లల్లో వివిధ కారణాలతో సుమారు నాలుగు వేల వరకు చనిపోయినా.. మిగతావి ఎలాగైనా బతుకుతాయి.
రోజూ చేపలకు దాణాగా తౌడు, గుళికలు కలిపి కింటా వరకు వేయాలి. తాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నందుకు తనపై భారం తగ్గిందని.. ఉన్నపళంగా చేపల చెరువులు మొదలు పెట్టాలంటే మాత్రం తక్కువలో తక్కువ రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతాయన్నారు. దళితబంధు తీసుకున్న లబ్ధిదారుల్లో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఇలాంటి చెరువులు ఏర్పాటు చేసుకుంటే ఆదాయం బాగుంటుందని ఆయన తెలిపారు.
కేసీఆర్ దయతో నా కల నెరవేరింది
ఎలాగైనా చేపల పెంపకం చేపట్టాలన్నది నా కల. అప్పుగా తెచ్చుకున్న లక్షన్నర, రెండు లక్షల్లో పాత ట్రాలీ ఒకటి కొనుక్కొని, విజయవాడ నుంచి పాత పడవలు తెచ్చుకుందామనుకున్నాం. దళితబంధు రూపం లో సీఎం కేసీఆర్ ఆదుకున్నడు. ఇప్పుడు ఆ దేవుడిదయతో పదేళ్లు ఎలాంటి ఢోకా ఉం డదు. ఏటా రూ.5 లక్షల పెట్టుబడి పెడితే.. రూ.10 లక్షల దాకా సంపాదించవచ్చు.
– కిష్టయ్య, పోలంపల్లి గ్రామం, భీమారం మండలం, మంచిర్యాల జిల్లా
మా ఇంటికి దళితబంధు ఆధారమైంది
దళితబంధుతో మా కుటుంబానికి జీవనాధారం దొరికింది. బయటికి కైకిలి పోవు డు తప్పింది. మా కష్టం మేం చేసుకుంటం. మాకు రూ.10 లక్షలు ఇచ్చి కేసీఆర్ ఎంతో మేలు చేశారు. అది తలచుకుంటేనే ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి మేం రుణపడి ఉంటాం.
– వడ్లకొండ లక్ష్మి, కిష్టయ్య భార్య
చకచకా చేపల పెంపకం
దళితబంధు పథకానికి కిష్టయ్య ఎంపికయ్యాడు. ఈ పథకం కింద రూ.10 లక్షల రుణసాయం అందింది. ఆ సొమ్ముతో కొత్త ట్రాలీయే కొనుక్కున్నాడు. అల్యూమినియంతో ప్రత్యేకంగా తయారు చేసిన మూడు బోట్లను సమకూర్చుకున్నాడు. రూ.లక్షతో చేపపిల్లలు కొనుగోలు చేసి చెరువులో పెంచసాగాడు. చేపల దాణాకు రూ.లక్ష అడ్వాన్సుగా చెల్లించాడు. చెరువుల్లో చేప పిల్లలు పోసి ఇప్పటికే మూడు నెలలైంది. మరో పది నెలల్లో చేపలు అమ్మకానికి వస్తాయి. దిగుబడి చేతికందే సరికి రూ.10 లక్షల ఆదాయం తప్పకుండా మిగులుతుందని కిష్టయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి దాకా చేపల చెరువులకు సిమెంట్ సరఫరా చేసే లారీకి డ్రైవర్గా పనిచేసిన ఆయన, నేడు ‘దళిత బంధు’తో చేపల చెరువుకు యజమానిగా మారి ఆత్మగౌరవంతో బతుకుతున్నాడు.