హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రోజుకో నిబంధన తెరపైకి వస్తున్నది. క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలోతొక్కి లబ్ధిదారులతో చెలగాటం ఆడుతున్నారు. నిర్మాణ వైశాల్యం (బిల్టప్ ఏరియా) గరిష్ఠంగా 650 చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) మేర ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు చెప్తుండగా, అంతకన్నా తక్కువ వైశాల్యంలో ఉంటే నిధులు మంజూరుచేసేది లేదని అధికారులు స్పష్టంచేస్తున్నారు. మం జూరు పత్రాలు ఇచ్చినప్పుడు అవేవీ పట్టించుకోకుండా నిర్మాణాలు ప్రారంభించాలని చెప్పి న అధికారులు, ఇప్పుడు నిర్మాణాలు మొదలుపెట్టిన ఇండ్లనూ రద్దుచేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల ఇండ్లను రద్దుచేశారు.ఇంటిని కూల్చుకొని నిర్మాణం మొదలుపెట్టగానే నిబంధనలకు అనుగుణంగా లేదని చెప్తుండటంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
నిర్మాణం మొదలుపెట్టాక రద్దు చేశారు!
రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మున్సిపాలిటీ 12వ వార్డులో వినాయకరావు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి ఆయనకున్న 56 గజాల్లో ఇల్లు నిర్మాణానికి అనుమతించారు. దీంతో ఆయన తన పెంకుటిల్లును కూల్చుకొని అక్కడే ఇంటి నిర్మాణం చేపట్టారు. నిబంధనల ప్రకారం రెండు గదులు, వంటగది, ఒక టాయిలెట్ నిర్మించే విధంగా ప్లానింగ్ చేసుకొని పునాదుల వరకు నిర్మించారు. ఫొటో తీసుకొని మొదటి విడత బిల్లుని లబ్ధిదారుడి ఖాతాలో జమచేయాల్సిన అధికారులు, అది చేయకుండా ఇంటి బిల్టప్ ఏరియా పిల్లర్ టు పిల్టర్ 600 ఎస్ఎఫ్టీ లేదని పేర్కొంటూ బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. దాదాపు నెలరోజులుగా లబ్ధిదారుడు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ను కలిసి తన బాధ చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది.
అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తరువాతే తాను నిర్మాణం మొదలుపెట్టానని, ఇప్పుడేమో నిబంధనలకు అనుగుణంగా లేదని చెప్తున్నారని సదరు లబ్ధిదారుడు వాపోతున్నారు. కనీసం తనకు ఇచ్చిన మంజూరు పత్రాన్ని రద్దు చేస్తున్నట్టు లిఖితపూర్వకంగా తెలిపితే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వినాయక్‌రావు చెప్తున్నారు. కాగా, అధికారులు బిల్లు చెల్లించకపోవడమే కాకుండా ఏదీ తేల్చకుండా నాన్చుతున్నారు. ఉన్న ఇంటిని కూలగొట్టుకొని తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని, తనకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తనకున్న 56 గజాల్లో సెట్‌బ్యాక్స్ వదలకుండా ఇల్లు నిర్మిస్తే, సుమారు 500 చదరపు అడుగుల వరకు నిర్మాణం చేసుకునే అవకాశం ఉన్నది. సదరు లబ్ధిదారుడు మూడువైపులా ఒక్కో అడుగు చొప్పున సెట్‌బ్యాక్ వదిలి నిర్మించడంతో బిల్డప్ ఏరియా తగ్గిపోయింది. నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా లేకుంటే పై అంతస్తు నిర్మించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నాడు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి.
ఇప్పటికే 20 వేలకుపైగా ఇండ్ల రద్దు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లక్షల ఇండ్లను మంజూరు చేయగా, అందులో దాదాపు లక్షన్నర మంది లబ్ధిదారులు నిర్మాణం చేపట్టారు. కొందరికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత నిధులను కూడా విడుదలచేసింది. ఇలా ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.120 కోట్ల వరకు జమయ్యాయి. కాగా, నిర్మాణాలు చేపట్టినవాటిలో దాదాపు 20 వేలకుపైగా ఇండ్లను నిబంధనలకు అనుగుణంగా లేవంటూ రద్దుచేశారు. దీంతో ఉన్న ఇండ్లను కూల్చుకొని కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల బాధ వర్ణనాతీతంగా మారింది. కేంద్ర ప్రభుత్వ పీఎంఏవై పథకంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అనుసంధానం చేసుకొని ఇండ్లను మంజూరు చేయాల్సి ఉండగా, అధికారులు ఆదరాబాదరాగా మంజూరు పత్రాలు ఇచ్చి తీరా నిర్మాణాలు మొదలుపెట్టాక చేతులెత్తేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వతీరు కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాక్కున్న చందంగా ఉన్నదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కార్పెట్ ఏరియా కనీసం 30 చదరపు మీటర్లు ఉంటే చాలు
పీఎంఏవై నిబంధనల ప్రకారం కార్పెట్ ఏరియా (గోడలు, బాల్కనీలు మినహా లివింగ్ ఏరియా) కనీసం 30-45 చదరపు మీటర్ల వరకు ఉండాలి. దీని ప్రకారం 322 చదరపు అడుగుల నుంచి 484 చదరపు అడుగల వరకు నిర్మించుకునే వెసులుబాటు ఉన్నది. స్థలం తక్కువుంటే పైఅంతస్తులో ఒక గది నిర్మించుకునే అవకాశం ఉన్నది. పైఅంతస్తు నిర్మించుకోరాదనే నిబంధన ఎక్కడా లేదు. అయినా అధికారులు మొండికేస్తుండటంతో లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 650 చదరపు అడుగల వరకు నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. స్థలం తక్కువగా ఉన్నవారు పైఅంతస్తు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవచ్చు. అధికారులు ప్రభుత్వంతో చర్చించకుండా, కేంద్ర నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఇండ్లను రద్దుచేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.