 
                                                            నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 30: ముంచుకొచ్చిన మొంథా తుపాను (Cyclone Montha) పెనుబీభత్సం సృష్టించింది. వర్షాలు రికార్డు స్థాయి లో కురిసిన ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పరిస్థి తి చాలా దయనీయంగా ఉన్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో 15వేల మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. నగరంలోని 1200 మందిని 9 పునరావాస కేంద్రాలకు తరలించారు. కాలనీలు, ఇండ్ల ముందు ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాన తగ్గినా వరద ఉధృతి ఆందోళనకరంగానే కొనసాగుతున్నది. మరో 18 గంటల వరకు వరద తగ్గే పరిస్థితి లేదని అధికారులు స్పష్టంచేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. వరంగల్ మట్టెవాడ ఏఎస్పీ శుభంకుమార్ హంటర్‌రోడ్‌లోని సాయినగర్ కాలనీలో నివాసం ఉంటుండగా, వరద కారణం గా ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నందున… ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏ ఎస్పీ ఇంటికి పడవ ద్వారా వెళ్లాయి. వారితో కలిసి వచ్చిన ఏఎస్పీ.. విధులకు హాజరై, సహా యక చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఖమ్మంలోని మున్నేరు ఉగ్రరూపం దాల్చిం ది. వర్షం తగ్గినప్పటికీ గురువారం సాయం త్రం కూడా 26 అడుగుల గరిష్టస్థాయి వద్ద వేగంగా ప్రవహించింది. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలంలోని ఏదుపులారం మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా మానకొండూర్ శ్రీనివాస్‌నగర్‌కు పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం వచ్చిన ఓ కుటుంబం మొంథా తుపాను ధాటికి సర్వం కోల్పోయింది. సుమారు 16 వేల బాతులు వరదలో కొట్టుకుపోవడంతో రోడ్డునపడింది. బాధితులు తీవ్రంగా శ్రమించి.. 4 వేల బాతు పిల్లలను రక్షించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిలోని చౌటచెరువు అలుగు పారుతున్నది. సమీపంలోని ఎస్సీ కాలనీ మొత్తం జలమయమైంది. విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోయింది. కాలనీ సమీపంలో ముండ్ల పొద లు, గుంతలు ఉండటంతో రాత్రి వేళ ఇండ్లలోకి విషసర్పాలు వచ్చే ప్రమాదముందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైళ్లను యథావిధిగా నడిపిస్తున్నట్టు గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
హనుమకొండ జిల్లా కొత్తపల్లికి చెందిన నాగేంద్రం (58) కల్వర్టులో పడి మృతి చెందాడు. హనుమకొండలోని సమ్మయ్యనగర్కు చెందిన రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారి శ్రీనివాస్ మధ్యాహ్నం వరదలో గల్లంతు కాగా, సాయంత్రం మృతదేహం లభ్యమైంది. వరంగల్ జిల్లా గుట్టకిందిపల్లెకు చెందిన అనిల్‌కుమార్ (30) మైసయ్యనగర్ వద్ద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్ఆర్నగర్లో గుడిసెలో ఉన్న అడెపు కృష్ణమూర్తి (65) మంచంపై నుంచి వరద నీటిలో పడి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా రెడ్యాలకు చెందిన సంపత్ (30) బుధవారం రాత్రి మొట్లతండా పెద్దచెరువు మత్తడిలో కొట్టుకొని పోయి మృతి చెందాడు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో కోల రామక్క(80) తన ఇంట్లో నిద్రించగా మట్టి గోడ కూలి మృతి చెందింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన గద్దల సూరమ్మ (58) కూడా ఇంటి గోడ కూలి కన్నుమూసింది. హైదరాబాద్‌కు చెందిన శివకుమార్, వరంగల్ జిల్లా దమ్మన్నపేటకు చెందిన శ్రావ్యను వారి సొంతూరుకు బైక్‌పై తీసుకొస్తుండగా జనగామ జిల్లా తిమ్మంపేట శివారులోని బోళ్ల మత్తడిలో కొట్టుకుపోయారు. శివకుమార్ చెట్టుకొమ్మను పట్టుకొని సురక్షితంగా బయటపడగా శ్రావ్య వరదలో గల్లంతయింది.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి నుంచి సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు బయల్దేరిన దంపతులు మోత్కులపల్లి వద్ద రోడ్డ్యామ్ మీద వరద ఉధృతిలో కొట్టుకుపోగా, గాలింపు కొనసాగుతున్నది. ఘటనా స్థలాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా మజీద్‌పూర్ కల్వర్టు దాటుతుండగా కృష్ణవేణి (45) భర్త ప్రభాకర్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా కల్వర్టు వద్ద ప్రవాహంలో కొట్టుకుపోయింది. స్థానికులు వరదలో దూకి.. స్పృహ కోల్పోయిన ఆమెను ఒడ్డుకు చేర్చి.. దవాఖానకు తరలించారు. ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి అస్థికలు కలిపేందుకు పుట్టింటికి వచ్చిన ఆమె… దుర్మరణం పాలవ్వడంతో స్వగ్రామం నెర్రెపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
                            