 
                                                            నందికొండ/కేతేపల్లి/మోర్తాడ్, అక్టోబర్ 30: మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతున్నది. నాగార్జునసాగర్ జలాశయానికి గురువారం 98,376 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అదే స్థాయిలో అవుట్‌ఫ్లోను కొనసాగిస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను పూర్తిస్థాయి మేర నీరు నిల్వ ఉన్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో బుధవారం రాత్రి నుంచి మూసీ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. 2023 జూలైలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఇన్‌ఫ్లో హెచ్చు తగ్గులుగా వస్తున్నది.
కాగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం రావడంతో ఇన్‌ఫ్లో 17 వేల క్యూసెక్కుల నుంచి 49,791.50 వేల క్యూసెక్కులకు పెరిగింది. మధ్యాహ్నం తర్వాత ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతూ 33,931 క్యూసెక్కులకు చేరింది. 8 క్రస్టు గేట్లలో 7 గేట్లను 10 అడుగుల మేర, ఒక గేటును 5 అడుగుల మేర ఎత్తి 47,729 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భారీ మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేసినందున నదిలోకి రైతులు, మత్స్యకారులు, గొర్రెలు, మేకల కాపరులు ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా మూసీ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడంతో భీమారం వంతెన వద్ద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో భీమారం మీదుగా సూర్యాపేట-మిర్యాలగూడెం వెళ్లే వాహనాల రాకపోకలు నిలిపి వేశారు.
శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద పెరిగింది. గురువారం ఎస్సారెస్పీకి 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోరాగా, 26 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల వరద రాగా, మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
 
                            