పెనుబల్లి, జనవరి 11 : సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన 18 మంది ముఠా సభ్యులను ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారని గత నెల 24న సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగ సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉడతనేని వికాస్దరి, పోట్రు మనోజ్ కల్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రకాశ్, మేడ సతీశ్, మోరంపూడి చెన్నకేశవ సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా రూ.547 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టినట్టు గుర్తించారు.
మనోజ్ కల్యాణ్ బ్యాంకు ఖాతాలో రూ.114.18 కోట్లు, అతడి భార్య భానుప్రియకు చెందిన రెండు బ్యాంకుల ఖాతాల్లో రూ.45.62 కోట్లు, మనోజ్ కల్యాణ్ బామ్మర్ది సతీశ్ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ.81.72 కోట్లు, కరీంనగర్‌కు చెందిన తాటికొండ రాజు అనే వ్యక్తికి చెందిన నరసింహ కిరాణం అండ్ డెయిరీ ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్దరి ఖాతాలో రూ.80.41 కోట్ల చొప్పున లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. సత్తుపల్లి పరిసర గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులను ఉద్యోగాల కల్పన పేరుతో పిలిపించుకుని, వా రితో బ్యాంకుల్లో ఖాతా తెరిపించి, ఆయా అకౌంట్లలో క్రెడెన్షియల్స్‌ను తీసుకుని సైబర్ క్రైమ్ నేరాల సొత్తును జమ చేయడానికి వినియోగించారని తేలింది. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జతకట్టి విదేశాల్లో కాల్‌సెంటర్లు నిర్వహిస్తూ వాటిద్వారా దేశంలోని పౌరులకు పెట్టుబడి, మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మా రెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసగించారు.
వారి మాటలకు ఆకర్షించబడిన బాధితుడిని వారి టెలిగ్రా మ్ గ్రూపులో సభ్యుడిగా చేర్చి, తర్వాత వారికి మోసపూరిత లింకులు పంపి వారి అకౌంట్లో నుంచి డబ్బు ఖాళీ చేసేవారు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన సొత్తును మొదట వీరి ఏజెంట్ల ద్వారా తెరిపించిన బ్యాంక్ అకౌంట్లోకి బదలాయించేవారు. తర్వాత కరెంట్ అకౌంట్లోకి మార్చి, చివరగా తమ పర్సనల్ అకౌంట్లోకి చేర్చేవారు. ఈ సైబర్ నేరగాళ్లకు సహకరించిన సదాశివపాలెం, సీతారాంపురం, రామానగరం, తుమ్మూరు గ్రామాలకు చెందిన జుంజునూరి శివకృష్ణ, వడ్లమూడి నరేంద్ర, మల్లాది శివ, సాధు పవనసందీప్, సాదు సంధ్య, సాధు లేఖ, లింగపాలెం గ్రామానికి చెందిన జొన్నాదుల తిరుమల, కందుకూరి మణికంఠ, తన్నీరు మహేశ్, గోళ్లమూడి నాగముఖేశ్, కంచపోగు శ్రీనివాస్, రాయల అజయ్‌కుమార్, గోపి, పల్లా గణేశ్, రాయల గోపీచంద్, కందుకూరి జగదీశ్, కరీంగనర్‌కు చెందిన తాటికొండ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోట్రు ప్రవీణ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు.