Vemula Veeresham | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి న్యూడ్ వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లను నకిరేకల్ పోలీసులు అరెస్టు చేశారు. తమ విచారణలో భాగంగా ఆ సైబర్ నేరగాళ్లను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నకిరేకల్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి గత మంగళవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్ నుంచి సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేశారు. వాట్సాప్‌లో తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేయగా, అవతలి వైపు నుంచి ఒకరు నగ్నంగా కనిపిస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేశారు. అనంతరం ఆ వీడియోను ఎమ్మెల్యే వీరేశం వాట్సాప్‌కు పంపి డబ్బులు పంపించాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఆయన స్పందించకపోవడంతో అదే వీడియోను వీరేశం కాంటాక్ట్స్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పంపారు. వాళ్లంతా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన షాక్ తిన్నాడు. వెంటనే నకిరేకల్ టౌన్ సీఐ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ ద్వారా ఆయన సైబర్ క్రిమినల్ నంబర్‌ను బ్లాక్ చేయించారు.