హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా 1991వ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో అనురాగ్‌శర్మ, మహేందర్‌రెడ్డి తర్వాత పూర్తికాలపు డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. మహేందర్‌రెడ్డి తర్వాత డీజీపీలుగా చేసిన అంజనీకుమార్, రవిగుప్తా, జితేందర్, శివధర్‌రెడ్డి.. హెడ్ ఆఫ్ పోలీసు ఫోర్స్, కోఆర్డినేషన్ డీజీపీలుగానే కొనసాగారు. యూపీఎస్సీ ప్రతిపాదనల మేరకు ఆయా రాష్ర్టాలు పూర్తికాలపు డీజీపీని నియమించుకోవల్సిందేనని సుప్రీంకోర్టు గతంలో స్పష్టంచేసింది. అయినప్పటికీ తెలంగాణలో డీజీపీ (కోఆర్డినేషన్)గా నియమిస్తున్నారని ఆరోపిస్తూ.. సామాజిక కార్యకర్త ధన్‌గోపాల్ హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ నియమాలను పా టిస్తూ సీవీ ఆనంద్‌ను నియమించిన నేపథ్యంలో ఆ కేసు వీగిపోనున్నది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఉద్యోగకాలం గురువారంతో ముగియనున్నది.
పూర్తికాలపు డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్.. కనీసం రెండేండ్లపాటు సేవలు అందించనున్నారు. ఆ తర్వాత కూడా ఉద్యోగ విమరణ వయసు వచ్చే వరకూ ఆయన సేవలను ప్రభుత్వాలు వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఆయనను తొలగించాలంటే మళ్లీ యూపీఎస్సీని ఆశ్రయించాల్సి ఉంటుంది. సీఎస్ రామకృష్ణారావు జారీచేసిన ఉత్తర్వుల్లో ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల నియామక నిబంధనలతోపాటు, గత మార్చి 12న యూపీఎస్సీ మీటింగ్ మినిట్స్‌కు అనుగుణంగానే ఈ నియామకం చేపట్టినట్టు స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి డీజీ అర్హత పొందిన ఐదుగురి పేర్లను ప్రభుత్వం యూపీఎస్సీకి సిఫారసు చేయగా.. అందులో సీనియారిటీని బట్టి యూపీఎస్సీ ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అందులో సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు ఉండగా.. ఇప్పుడున్న ఐపీఎస్‌లలో అత్యంత సీనియర్ అయిన సీవీ ఆనంద్‌కు ప్రభుత్వం డీజీపీగా అవకాశం కల్పించింది.
ఐపీఎస్ శిక్షణ అనంతరం ఏఎస్పీగా మొదటి పోస్టింగ్ పొంది వరంగల్ రూరల్ సబ్ డివిజన్లో పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లిలో అడిషనల్ ఎస్పీగా, నిజామాబాద్ ఎస్పీగా చేశారు. అప్పుడే ఆయన ప్రెసిడెంట్ గ్యాలెంట్రీ మెడల్ అందుకున్నారు. ఆ తర్వాత కృష్ణాజిల్లా ఎస్పీగా, హైదరాబాద్ ఈస్ట్‌జోన్, సెంట్రల్ జోన్ డీసీపీగా మతఘర్షణలను సమర్థవంతంగా నివారించారు. డీఐజీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత సీఐడీలో ఈవోడబ్ల్యూలో పనిచేస్తూ.. బ్యాంకాక్ నుంచి ఆపరేట్ అవుతున్న కృషి బ్యాంక్ స్కామ్ నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత డీఐజీ ఏలూరు, విజయవాడ పోలీసు కమిషనర్‌గా, ఎక్సైజ్ డైరెక్టర్‌గా పనిచేశారు. విజయవాడలో రౌడీ మూకలను అరికట్టడంలో కృషి చేశారు. ఐజీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత ట్రాఫిక్ అడిషనల్ సీపీగా పనిచేస్తూ.. ఈ-చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆటొమేటిక్ ట్రాఫిక్ సిస్టమ్, స్కూల్ ట్రాఫిక్ కమాండోస్, ఫ్రీ లెఫ్ట్, రివర్సబుల్ లైన్స్, వన్‌వే, యూటర్న్ వంటి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఆయనదే.
2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భూ వివాదాల పరిష్కారం కోసం ఎస్ఓపీలను సిద్ధం చేయడంతో ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. నాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు షీటీమ్స్, షీషటిల్స్, షీయాప్స్ ద్వారా మహిళలకు భద్రతను బలోపేతం చేశారు. సైబరాబాద్‌లో రెండు లక్షల సీసీటీవీలు ఏర్పాటుచేసి, ఓఆర్ఆర్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎన్నికల కమిషన్ నుంచి నేషనల్ బెస్ట్ ఎక్స్పెండిచర్ కంట్రోల్ అవార్డు అందుకున్నారు. ఏడీజీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత సివిల్ సప్లయ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి.. 17,500 రేషన్ దుకాణాలలో ఈ-పోస్ యంత్రాలను ప్రవేశపెట్టి, రైతులకు మూడు రోజుల్లోనే చెల్లింపులు జరిగేలా ఈ-పేమెంట్స్‌ను అమలుచేశారు. 1,400 లారీలకు జీపీఎస్ అమర్చి వాటి కదలికలను ఎల్ఈడీ స్రీన్ల ద్వారా పర్యవేక్షించే విధానం ఏర్పాటుచేశారు. గోదాముల్లో 1,500 సీసీటీవీలను ఏర్పాటుచేసి అవినీతిని తగ్గించారు.
ఈ విధానాలను 12 రాష్ర్టాలు అమలు చేశాయి. కార్పొరేషన్ అప్పును రూ.15,500 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు తగ్గించారు. సీఐఎస్ఎఫ్ ఐజీగా ఎయిర్పోర్ట్ సెక్టార్లో దేశవ్యాప్తంగా విమానయాన భద్రతను పర్యవేక్షించారు. అక్కడ యాంటీ సాబొటేజ్, యాంటి హ్యాకింగ్ వ్యవస్థలను తీసుకొచ్చారు. డీజీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత హైదరాబాద్ సీపీగా నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్, సైబర్ క్రైమ్స్‌ను సమర్థంగా నియంత్రించారు. ఆ తర్వాత హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి.. పూర్తికాలపు డీజీపీగా నియమితులయ్యారు. పోలీసుశాఖకు ఆయన అందించిన సేవలకు గాను 10కి పైగా ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి.
రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్ మండలం కుంట్లూర్ గ్రామానికి చెందిన చిన్న దామోదర్‌రెడ్డి, యశోదాదేవి దంపతులకున్న ఐదుగురు కుమారుల్లో చిన్న కుమారుడు సీవీ ఆనంద్. వారి కుటుంబం 1959లోనే హైదరాబాద్ నగరానికి వలస రాగా, 1968 జూన్ 5న సీవీ ఆనంద్ జన్మించారు. తండ్రి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కన్జర్వేటర్‌గా ఉద్యోగ విరమణ పొందారు. ఆనంద్ పెద్దన్న వినోద్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేసి విమాన ప్రమాదంలో మరణించారు. ఆనం ద్ విద్యారణ్య హైస్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్)లో విద్యాభ్యాసం చేశారు. 10వ తరగతిలోనే ఐసీఎస్ఈలో, ప్లస్12లో ఐఎస్సీలో ప్రథమ స్థానంలో నిలిచారు.
బీఏ (మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్) పూర్తిచేశారు. ఓయూలో ఎంఏ ఎకనామిక్స్ చేశారు. ఆనంద్‌కు క్రికెట్ అం టే మక్కువ.. హైదరాబాద్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించి 1986 లో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ అండర్-22కు ప్రాతినిధ్యం వహించినప్పటికీ రంజీ ట్రోఫీల్లో ఎంపిక కాలేకపోయారు. దీంతో ఆ కసిని సివిల్స్‌పై మళ్లించి.. మొదటి ప్రయత్నంలో కేవలం 22 ఏండ్ల వయసులోనే సివిల్స్ సాధించి, హోం స్టేట్‌కు నియమితులయ్యారు.