‘నాకు సినిమా అంటే ఇష్టం. నిద్రలేచిన క్షణం నుంచీ ఒక కంటెంట్ క్రియేటర్‌గా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా నాలోనేను ఫీలవుతూ ఆలోచిస్తూనే ఉంటాను. నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోడానికి ఇదొక మార్గమని నమ్ముతాన్నేను. కంటెంట్ క్రియేషన్ అనేది నా బిజినెస్. సినిమా అంటే నాకు ప్యాషన్. ఈ రెండూ కలిపితేనే నేను’ అంటున్నారు యువ నటుడు దొర సాయితేజ. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ‘దందా’ వెబ్‌సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు దొర సాయితేజ. ఈ తరుణంలో తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ‘ప్రభాస్ ‘అడవిరాముడు’ సినిమాలో చిన్నప్పటి ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పాను.
అప్పట్నుంచి నా సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత అడపాదడపా వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటిస్తూ వచ్చాను. 2018లో నా యూట్యూబ్ జర్నీ మొదలైంది. ‘బ్యాక్ బెంచర్స్’ సిరీస్‌తో గుర్తింపు వచ్చింది. గత ఏడాది కంటెంట్ క్రియేషన్ కంపెనీ ప్రారంభించాను. రీసెంట్గా మళ్లీ ‘దందా’ సిరీస్‌తో సక్సెస్ వచ్చింది. అందులో నేను పోషించిన అరవింద్ పాత్రకు మంచి స్పందన వస్తున్నది. ఈ క్రెడిట్ అంతా మా దర్శకుడు దేవులపల్లి ఆదిత్యదే. ప్రస్తుతం యూట్యూబ్ వరకే ఉన్న నా ఫాలోయింగ్‌ని థియేటర్ వరకూ తీసుకురావడమే నా లక్ష్యం’ అని చెప్పారు దొర సాయితేజ. ఇకపై తనను అంతా కొత్తగా చూస్తారని, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఆగకుండా లక్ష్యాన్ని చేరతానని దొరసాయితేజ నమ్మకం వ్యక్తం చేశారు.