శ్రీశైలం, ఆగస్టు 9 : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి రెండురోజులుగా నీటి విడుదల తగ్గిస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంటుంది. ఇరురాష్ర్టాల జల విద్యుత్కేంద్రంలో జరుగుతున్న ఉత్పత్తి ద్వారా వస్తున్న నీటిలో సగానికి పైగా దిగువకు అవుట్‌ఫ్లోగా వెళ్లిపోతుంది. ఆదివారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 44,279 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రానికి 1,01,384 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వచ్చి చేరుకున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు ప్రస్తుతం 878.60 అడుగులు ఉండ గా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 181.05 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు నమోదయ్యాయి. అదే విధంగా కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 14.883 మి లియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చె య్యగా, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 11.400 మిలియన్ యూ నిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి 60, 117 క్యూసెక్కుల నీటిని అవుట్ ఫ్లోగా దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు.
గద్వాల, ఆగస్టు 9 : ఎగువ నుంచి జూరాలకు వరద పూర్తిగా తగ్గిపోవడంతో అధికారులు జూరాల గేట్లను మూసి వేశారు. భీమా నది నుంచి 57,000 క్యూసెక్కుల వరద జూరాలకు వస్తుంది. అయితే ఇందులో విద్యుదుత్పత్తికి 44,279 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.96 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవల్ 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.531 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ప్లో 57,000 క్యూసెక్కుల వరద నమోదవుతుండగా అవుట్ ఫ్లో 48,123 క్యూసెక్కులుగా ఉంది.
అయిజ, ఆగస్టు 9 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 40,500 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,525 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం గరిష్ఠ స్థాయి నీటిమట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1624.74 అడుగుల నీటి మట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 75.644 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు.