వివిధ పత్రికల్లో పనిచేసి సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన కోడం పవన్ కుమార్ వృత్తి రీత్యా-ప్రవృత్తి రీత్యా రాసిన అనేకానేక వ్యాసాల నుంచి ఎంపిక చేసిన వాటితో ‘లోపలి చూపు’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఇవి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యాసాలు అయినప్పటికీ- ఇవన్నీ తెలంగాణ నేపథ్యంలో రూపొందాయని గమనించవచ్చు.
భూమి కోసం, భుక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి రచయిత పవన్ కుమార్ ప్రస్తావిస్తారు. తెలంగాణ సంపదగా నిజాం ఆభరణాలను గుర్తించి సేకరించాలని అంటారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న బృహత్తర లక్ష్యంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పనిచేస్తున్నదని అంటారు. బల్దియా ఎన్నికల్లో విజయం సాధించడం, కొత్తగా వచ్చిన కార్పొరేటర్లకు శిక్షణ కార్యక్రమాల రూపంలో దిశానిర్దేశం చేయడం, మూసీ సుందరీకరణతో పూర్వవైభవం తీసుకురావడం బాగానే ఉన్నది. కానీ ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ మహనీయుల విగ్రహాల ఏర్పాటును పట్టించుకోకపోవడం అన్యాయం అని అంటారు. భారత రజతోత్సవ సభలో కేసీఆర్ అత్యంత పేలవంగా మాట్లాడటం ఏమో కానీ, కవిత రాసిన లేఖ మాత్రం పార్టీలో కల్లోలం సృష్టించింది అని అంటారు.
తెలంగాణ ఉద్యమ ప్రతిరూపాన్ని, ఉప ఎన్నికల్లో విజయాన్ని, ఆదివాసీల మనుగడ కోసం చేయాల్సిన చట్టాలు, తెలంగాణ బ్రాండ్ పేరుతో గృహావసర వస్తువులను మార్కెట్లో ప్రవేశపెట్టాలనే ఆలోచనలను సమర్థించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న ప్రధాన లక్ష్యంతో బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలను రెండు వ్యాసాల్లో వివరించారు.
హైదరాబాద్ విమానాశ్రయ చరిత్ర, హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ పతంగుల పండుగను వివరించడంతోపాటు టూరిస్ట్ ఫెస్టివల్‌గా బాలల చిత్రోత్సవాన్ని విస్తృతపరచాలని అంటారు. ఐటీ అభివృద్ధిలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. పత్తి, కందిపప్పు, ఉల్లి ధరలు పెరుగడం, అందులో కొనసాగుతున్న అనిశ్చితి, రైతుల ఆత్మహత్యలకు పురిగొల్పడం విచారకరం అంటారు. ఆకాంక్షలకు దూరంగా బడ్జెట్ ఉండవద్దని సూచిస్తారు. గోల్కొండపై ఎగురవేసిన జాతీయ పతాకంతో మన వారసత్వాన్ని చాటుకున్నామని చెప్తూ, సాంస్కృతిక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవాలని అంటారు. నాగరికతకు నడక నేర్పిన మన వస్త్ర పరిశ్రమ గురించి చెప్తారు.
అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక కావడంతో అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించవచ్చునని అంటారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పురాతన రాతప్రతుల డిజిటలైజేషన్ జరిగింది. అక్కడ అసలైనవి మాయం చేసిన నకిలీ భూ దస్ర్తాలపై విజిలెన్స్ విచారణ జరుపాలని, మూతపడిన డిజిటలైజేషన్‌ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. పారిశ్రామికీకరణ, రకరకాల కాలుష్యాలతో భూ వాతావరణం, శీతోష్ణస్థితి, ఆవరణ వ్యవస్థ మీద ప్రభావం పడి భూతాపం పెరిగిపోతున్నది. మూసీ, హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారంలా తయారయ్యాయి. పర్యావరణం పలుకరిస్తే ఫార్మాసిటీ బతుకుతుంది. జీవవైవిధ్యం తరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘హరితహారం’ పేరిట చెట్ల పెంపకం, ముందుచూపుతో చేస్తున్న మంచి కార్యక్రమంగా కొనియాడతారు.
తెలంగాణ ఉద్యమ ప్రచార సారథిగా, మొదటినుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల్ని ఖండిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాల్ని ప్రతిపాదిస్తూ, నిఖార్సయిన తెలంగాణవాదిగా కోడం పవన్ కుమార్ రాసిన ఈ వ్యాసా లు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆ దిశగా మనల్ని పురిగొల్పుతాయి.
– కేపీ అశోక్ కుమార్ 9700000948