న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఎయిర్ కూలర్ల తయారీ దిగ్గజం సింఫనీ.. దేశీయ మార్కెట్‌కు ఏసీలను పరిచయం చేయబోతున్నది. ఆ తర్వాత బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లనూ తీసుకురావాలని యోచిస్తున్నది. రకరకాల శ్రేణుల్లో ఈ ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్‌కల్లా అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు తాజాగా సింఫనీ స్టాక్ మార్కెట్లకు వెల్లడించింది.
దీంతో ఇప్పటికే ఏసీ మార్కెట్లో ఉన్న సంస్థలకు ఇక గట్టి పోటీ ఎదురవ్వగలదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వ్యాపార విస్తరణలో భాగంగా ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ కేటగిరీలో బలోపేతం కావాలని సింఫనీ చూస్తున్నది. ఈ క్రమంలోనే ఏసీలు, బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ల తయారీపై దృష్టి పెట్టింది.