సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్ఎస్ రాజమౌళి ‘వారణాసి’ చిత్రం నుంచి రెండు ప్రత్యేకమైన స్టిల్స్‌ను మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్‌లో మహేశ్ ‘రుద్ర’గా నేచురల్ లుక్‌లో తొలిసారి ప్రపంచానికి కనిపించారు. పాలసంద్రంలో శేషపాన్పుపై సేదతీరే శ్రీమహావిష్ణువులా దట్టమైన అడవి మధ్యలో ఒక వెదురు తెప్పపై విశ్రాంతి తీసుకుంటున్న రుద్రను ఓ స్టిల్‌లో చూడొచ్చు. అలాగే.. కెన్యాలోని మసాయి మారా మైదానంలో జిరాఫీలు, క్రూరమృగాల మధ్య నిలబడి, వెనక్కి చూస్తున్న రుద్రను మరొక స్టిల్‌లో చూడొచ్చు. రుద్ర పాత్ర తీరుతెన్నుల్ని ఆవిష్కరించేలా ఈ రెండు స్టిల్స్ కనిపిస్తున్నాయి. ‘వారణాసి’ సినిమా సోల్‌ని కూడా సూచాయగా ఈ స్టిల్స్ చెబుతున్నాయి. కాలాన్ని దాటి ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ వ్యక్తి ప్రయాణమే ఈ సినిమా అని మేకర్స్ చెబుతున్నారు.
రాజమౌళి ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసేందుకు జన్మించినవాడు రుద్ర. అతను చమత్కారి. సున్నితమైనవాడు. ఉగ్రరూపం దాల్చగలడు. ఉగ్రంగా కనిపించే పాత్రను ఎవరైనా పోషించగలరు. కానీ ఒకేసారి ఉగ్రంగా, సున్నితంగా అభినయించగలవారు తక్కువమంది ఉంటారు. అందుకే ఈ పాత్రకు మహేశ్‌ని ఎంచుకున్నాను. మా ఆఫ్రికా షెడ్యూల్లో తీసిన స్టిల్స్ ఇవి. ఏ సెట్ ఇవ్వలేని అనుభూతిని మాకు ఆ నేల ఇచ్చింది. కిలిమంజారో చుట్టూ మసాయి మారాలో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను నిజంగా నివ్వెరపోయాను. ఉదయాన్నే మా కళ్ల ముందు కనిపిస్తున్న అందాన్ని ఐమ్యాక్స్ కెమెరా కూడా క్యాప్చర్ చేయలేదని మాకు అనిపించింది’ అంటూ పోస్ట్‌లో రాజమౌళి పేర్కొన్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, నిర్మాణం: శ్రీదుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్.