Power Cuts | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో అప్రకటిత విద్యుత్తు కోతలు ప్రజలకు నానా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సర్కిళ్లలో కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్‌గా చెప్పే సైబర్ సిటీలో పరిస్థితి దారుణంగా ఉన్నది. విద్యుత్తు కోతలను అధికారికంగా ప్రకటిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది. కానీ, మెయింటెనెన్స్ పేరుతో ఫిబ్రవరిలోనే చాలాసార్లు కరెంటు కట్ చేశారని మళ్లీ మార్చిలో కూడా ఎలాంటి ప్రకటనలు లేకుండా కరెంటు కట్ చేస్తున్నారని ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు. గచ్చిబౌలి, ఇబ్రహీంబాగ్ ప్రాంతాల్లో రోజుకు నాలుగైదుసార్లు కరెంటు తీసేస్తున్నారని, దీంతో ఇండ్ల నుంచి పనిచేస్తున్న (వర్క్ ఫ్రం హోమ్) ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని వాపోతున్నారు. ఈ సమస్యపై ప్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసినా, 1912 నంబర్‌కు కాల్ చేసినా పట్టించుకునేవారే లేరని, ఒకవేళ తమ ఫిర్యాదును ‘ఎక్స్’లో పోస్ట్చేస్తే వ్యక్తిగత వివరాలు తీసుకుని సిస్టమ్ జనరేటెడ్ మెసేజ్ సరిపెట్టడమే తప్ప సరైన స్పందనే లేదని మండిపడుతున్నారు.
నిరుటి కంటే 35% పెరిగిన డిమాండ్
హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో 80% సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోనే ఉన్నాయి. సైబర్సిటీలో 6 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజువారీగా 75-80 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుండగా.. అందులో సగానికిపైగా డిమాండ్ సైబర్ సిటీ, మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలో ఉంటుంది. ఇది నిరుటి కంటే 35% అధికం. సైబర్ సిటీలో నిరుడు అత్యధికంగా 714 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అది 850-900 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తగట్టుగా విద్యుత్తును అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటీవల సైబర్ సిటీ సర్కిల్లో కొత్తగా 232 పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 25 పవర్ ట్రాన్స్ఫార్మర్లతోపాటు 11 కేవీ ఫీడర్లు 128, 33 కేవీ ఫీడర్లు 4 అందుబాటులోకి తెచ్చారు. ఫీడర్ల విభజనతోపాటు పీటీఆర్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసినా అవి పూర్తిస్థాయిలో ఫలితం చూపలేకపోతున్నట్టు తెలుస్తోంది.
కాల్లో ఉండగానే కరెంట్ కట్..
మా దగ్గర కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే రోజూ రెండుమూడు సార్లు కరెంట్ తీసేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా క్లయింట్‌తో కాల్లో ఉండగానే కరెంట్ పోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– వెంకట్, సైబర్ టవర్, హైటెక్‌సిటీ
వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా ఆఫీసుకు వెళ్తున్నాం..
మా ఏరియాలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. వర్క్‌లో ఉండగానే కరెంట్ తీసేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరెంట్ కట్ ఎక్కువగా ఉండటంతో ఆఫీసుకు రమ్మని టీమ్‌లీడర్లు చెప్తున్నారు. దీంతో వర్క్ ఫ్రం హోం అయినా ఆఫీసుకు వెళ్తున్నాం. – భవాని, ఐటీ ఉద్యోగిని