హైదరాబాద్ : తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, ఇతర అంశాలపై సమీక్షించారు.
సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం, ఎఫ్సీఐ నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రంలో యాసంగి వరి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో రైతులు యాసంగిలో వరి సాగు చేయొద్దు అని సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న వారు వరి వేయొచ్చు అని పేర్కొన్నారు. ఇప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యమే కొంటామని కేంద్రం చెప్పింది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోటు కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చే మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి అని సీఎస్ సూచించారు.