శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 01:01:48

త్వరలో నాన్‌క్యాడర్‌ అధికారులకు పదోన్నతులు

త్వరలో నాన్‌క్యాడర్‌ అధికారులకు పదోన్నతులు

అక్టోబరు 31లోగా సీనియారిటీ జాబితా పంపాలి

అధికారులకు సీఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆయా ప్రభుత్వ శాఖల్లో నాన్‌క్యాడర్‌ అధికారుల పదోన్నతులకు కసరత్తు మొదలైంది. ఆయా శాఖల్లోని డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ)లు సమావేశమై అధికారుల సీనియారిటీ జాబితాను, ఖాళీల వివరాలను అక్టోబర్‌ 31లోపు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 2020-21 ప్యానల్‌ ఇయర్‌ను ఈవో నోట్‌ ద్వారా వెల్లడించారు. ఈ ప్యానల్‌ ఇయర్‌ ఈ సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది. అక్టోబర్‌ 31వ తేదీ తరువాత వచ్చిన జాబితాను స్వీకరించేది లేదని సీఎస్‌ స్పష్టం చేశారు. నాన్‌క్యాడర్‌ శాఖాధిపతులు, నాన్‌క్యాడర్‌ అడిషనల్‌/ జాయింట్‌ సెక్రటరీలు 3వ స్థాయి గెజిటెడ్‌ అధికారులకు పదోన్నతుల కోసం మార్గదర్శకాలు వెలువరించారు. అక్టోబర్‌ 31వ తేదీ నాటికి ఆయాశాఖలు సీనియారిటీ లిస్ట్‌, పదోన్నతుల అర్హత జాబితా, ఖాళీల వివరాలు, ఇందులో ఇప్పటివరకు ఉన్న ఖాళీలు, పదవీ విరమణల ద్వారా ప్యానల్‌ఇయర్‌ ముగిసే నాటికి అ య్యే ఖాళీల వివరాలు పంపాలని సూచించారు. ఆయా అభ్యర్థులకు జారీఅయిన చార్జీ మెమోలు, వారిపై తీసుకున్న క్రమశిక్షణా చర్యలు తదితర వివరాలతోపాటు 2015-16 నుంచి 2019-20 వరకు ఏసీఆర్‌లను జీఏడీకి ఆన్‌లైన్‌లో, హార్ట్‌కాపీలను సీల్‌ చేసి పంపించాలని ఆదేశించారు.