హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కంటి వెలుగు కార్యక్రమంపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ నెల 18న సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు.
2018లో నిర్వహించిన తొలివిడత కంటి వెలుగు కన్నా ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మన రికార్డు మనమే బద్దలుకొట్టి.. సరికొత్త రికార్డు సృష్టించాలని కలెక్టర్లను ప్రోత్సహించారు. ఇప్పటికే 15లక్షలకుపైగా కళ్లద్దాలను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలకు, అర్బన్ వైద్య కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కంటి వెలుగుపై ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికీ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, అత్యంత ఉన్నత ప్రమాణాలతో సేవలను అందించాలని సీఎస్ ఆదేశించారు.