చేర్యాల, సెప్టెంబర్ 29 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Temple) ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. స్వామి వారి ఉత్సవాలు ముగిసినప్పటికి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కొమురవెల్లి క్షేత్రానికి 5వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీ తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
రేపు మల్లన్న హుండీ లెక్కింపు
స్వామి వారి హుండీలను విప్పి సోమవారం లెక్కింపు జరుపనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వామి వారి ఆలయంలోని 22 నగదు హుండీలతో పాటు భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న బియ్యం హుండీలను తెరిచి తూకం వేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు భక్తులు స్వామి వారికి సమర్పించిన మిశ్రమ వెండి, బంగారు కానుకలను తూకం వేసి బ్యాంకులో జమ చేయనున్నట్లు వివరించారు. స్వామి వారి హుండీ లెక్కింపులను మరింత పటిష్ట భద్రత మద్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలు పరిశీలించామని అన్ని సక్రమంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
.