హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ తాము కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంలో కప్పదాటు సమాధానాలు ఇచ్చి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం విచారించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి విచారణకు ప్రత్యక్షంగా కాకుండా.. వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, సీహెచ్ వెంకటేశ్వరరావు, సంతోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
ఈ సందర్భంగా ఫిరాయింపునకు పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తాము పార్టీ మారలేదని చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, బీఆర్ఎస్ న్యాయవాదులు వారి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అన్ని ఆధారాలను చూపించారు. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని పొగడటం, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జితో భేటీ కావడం, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీకి సంబంధించిన ఆధారాలను చూపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తాము అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని చెప్పుకొచ్చారు. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకున్నారు. అయితే, పార్టీ కార్యక్రమాలకు రాకపోవడం, శాసనసభాపక్ష సమావేశాలకు హాజరుకాకపోవడంపై సమాధానాలు చెప్పలేకపోయారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ముకుల్‌రాయ్ టీఎంసీ పార్టీలో చేరి పీఏసీ చైర్మన్ పదవి పొందినందుకు న్యాయస్థానం ఆయనను పార్టీ ఫిరాయించారని నిర్ధారించిందని బీఆర్ఎస్ న్యాయవాదులు స్పీకర్ దృష్టికి తెచ్చారు. అరికెపూడి గాంధీ సైతం పీఏసీ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. గాంధీకి వచ్చిన పదవి కూడా అక్రమమే అని, ప్రజాస్వామ్యాన్ని స్పీకర్ రక్షించాలని న్యాయవాదులు విజ్ఞప్తిచేశారు. శనివారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ల క్రాస్ ఎగ్జామినేషన్ జరగనున్నది.